RRR: ఆస్కార్ వేడుక‌లో క‌న‌ప‌డ‌ని నిర్మాత‌.. కార‌ణం అదేనా?

దర్శక ధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్​ఆర్​ఆర్​. ఈ సినిమా విడుదలై ఏడాది కావస్తున్నా రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటు ఆస్కార్​ అవార్డు దక్కించుకుని ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆస్కార్​ పొందిన తొలి భారతీయ సినిమాగానూ ఆర్​ఆర్​ఆర్​ చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్​ రికార్డులను తిరగరాసింది. ప్రపంచ వ్యాప్తంగానూ మంచి టాక్​ తెచ్చుకున్న ఆర్​ఆర్​ఆర్​ పలు అవార్డులు కూడా దక్కించుకుంది. అయితే అంతా బానే ఉన్నా ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య ఆస్కార్​ వేడుల్లో, ప్రమోషన్స్​లో ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. అంతేకాదు ఆయన గురించిన ప్రస్తావన కూడా ఎక్కడా రాకుండా జాగ్రత్తపడింది చిత్రబృందం. దీని వెనుకున్న కారణాలేంటా అని సోషల్​మీడియాలో చర్చిస్తున్నారు నెటిజన్లు.

అయితే దానయ్య సినిమా నిర్మాణంలో ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టినప్పటికీ, అనంతరం జపాన్​, యూస్​ పర్యటనలు, ఆస్కార్​ ఎంట్రీ కోసం ప్రమోషన్లకు అయ్యే ఖర్చు మాత్రం పెట్టేందుకు ఇష్టపడలేదని, అందుకే దానయ్య ఎక్కడా కనిపించలేదని టాలీవుడ్​ టాక్​. ఆస్కార్​ నామినేష్లలో నిలిచేందుకు, అమెరికా పర్యటనకు అయ్యే ఖర్చు మొత్తం బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి కుటుంబం భరించిందట. అంతేకాదు ఆస్కార్​ పోటీలో నిలిచే ఆలోచన రాజమౌళి కొడుకు కార్తికేయదేనట. అందుకే ఎమ్ఎమ్​ కీరవాణి ఆస్కార్​ అందుకున్న తర్వాత చేసిన ప్రసంగంలో ప్రత్యేకంగా కార్తికేయకు కృతజ్ఞతలు చెప్పారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు. అందరి అంచనాలకు అందుకుంటూ అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టి అబ్బుర పరిచింది. కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ఇక ఇండియాలో థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ అవుతోంది.
కాగా, ఆర్​ఆర్​ఆర్​ ఆస్కార్ అందుకున్నందుకు చిత్రబృందాన్ని చూసి గర్వపడుతున్నానీ, తన సినిమాకు ఆస్కార్​ రావడం ఎంతో సంతోషమని తాజాగా నిర్మాత దానయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఆస్కార్​ గురించి తనతో రాజమౌళి, రామ్​ చరణ్​, ఎన్టీఆర్​ ఎవరూ సంప్రదించలేదని ఆయన అన్నారు. ఇక, ఆర్​ఆర్​ఆర్​ సినిమా పాన్​ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విప్లవకారులు అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​ నటించగా, గోండు జాతి బిడ్డ కొమురం భీమ్​గా జానియర్​ ఎన్టీఆర్​ ప్రేక్షకులను మెప్పించారు.