ఒక్క రోజే వెయ్యి కరోనా కేసులు… కేంద్రం అలెర్ట్‌!

భారత్‌లో చాపకింద నీరులో కరోనా ఏదో ఒక చోట విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే పలు దేశాల ప్రజలను పట్టిపీడిస్తున్న వైరస్‌.. భారత్‌ను ప్రస్తుతం వెంటాడుతోంది. దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆంక్షలు సడలించిన కారణంగా మళ్లీ కేసులు నమోదువుతున్నాయి. దీంతోపాటు దేశంలో నలుగురు కరోనాతో మృతి చెందటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్‌ అయ్యింది. తాజాగా పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

కేసుల నమోదు ఇలా..
దేశంలో గడిచిన 24 గంటల్లో 44,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… మొత్తం 918 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,350కి చేరింది. ఇక గత 24 గంటల్లో నలుగురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,806కి చేరింది. ఈ నేపథ్యంలోనే దేశంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ఈ రోజు కీలక సమావేశంలో కేంద్రం సమావేశం అయ్యింది. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం ఒక్కరోజే 1,000కి పైగా కొత్త కేసులు నమోదవడంతో అధికారులు అలెర్టు అయ్యారు.

ఏఏ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయంటే..
కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈక్రమంలో ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్‌ కట్టడికి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. రోజురోజుకు కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. కరోనాకి తోడు ఈ మధ్య ఫ్లూ కేసులు కూడా విపరీతంగా నమోదవడంతో ఏది కరోనా, ఏది వైరల్‌ అనే విషయంపై స్పష్టత రావట్లేదు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.

కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇలా..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా కేసుల పెరుగుదలతో జాగ్రత్తగా ఉండాలని.. జ్వరం, దగ్గు అయిదు రోజుల కంటే ఎక్కువ ఉంటే వైద్యులను తప్పనిసరి సంప్రదించాలని కోరింది. భౌతిక దూరం, ఇండోర్ లోనూ మాస్కుల వాడకం, చేతుల పరిశుభ్రత వంటివి తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. అధిక జ్వరం, తీవ్రమైన దగ్గు ఉంటే వైద్యుడిని సంప్రదించాలని పేర్కొన్నారు. టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వాక్సినేషన్ ను అమలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించింది. అయితే.. భారత్‌లో సుమారు 129 రోజుల తర్వాత ఒక్కరోజులోనే 1000కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.