లక్ష మందికి సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వాలి – KTR
సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టిక్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. మరోసారి స్పందించారు. ఇటీవల కార్డియాక్ అరెస్టులు(గుండెపోటు) సంభవించి యువకులు మృతిచెందిన సంఘటనలపై ఆయన మాట్లాడారు. అనేక మంది యువకులు తీవ్ర గుండెపోటు(కార్డియాక్ అరెస్టు)తో చనిపోవడం సామాజిక మాధ్యమాల్లో చూసి ఆశ్చర్యపోయానని, అదేవిధంగా అవి బాధకలిగించాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ మహా నగరంలో సుమారు లక్ష మందికి సీపీఆర్ శిక్షణ ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్జీవోలు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యూడా క్యాంపులు పెట్టి అనేక మందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లాలో సీపీఆర్ శిక్షణను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం నాన్ కమ్యూనికేబుల్ జబ్బులు అధికమయ్యాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మితంగా తినడం.. వ్యాయామం చేయడం మంచిదని సూచించారు. అదేవిధంగా జిమ్‌లలో తీవ్రమైన కసరత్తులు చేయకపోవడం మంచిదన్నారు. అనుమానం ఉంటే గుండెకు సంబంధించిన చిన్న చిన్న పరీక్షలు చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఇటీవల సామాజిక మాధ్యమాలలో వరుసగా గుండె పోటులతో యువకులు మృతి చెందడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఆయా సంఘటనల్లో సీపీఆర్ వచ్చిన వారు పక్కనే ఉంటే.. వారు బ్రతికి ఉండే అవకాశం చాలా వరకు ఉంటుందన్నారు. అందుకే ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో సీపీఆర్ విధానంపై అవగాహన పొంది శిక్షణ తీసుకున్నవారిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లైఫ్ స్టైల్ ఛేంజెస్ వల్ల అనేక రోగాలు చుట్టుముడుతున్నాయని.. సీపీఆర్‌ను నేర్పించగలిగితే సడెన్ కార్డియాక్ అరెస్టును తగ్గించొచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. సీపీఆర్ వల్ల గుండెకు రక్త ప్రసరణ ఆగిపోకుండా ప్రాథమికంగా ఆ వ్యక్తిని కాపాడుకోవచ్చు ఆయన అన్నారు.
వైద్య వ్యవస్థలో ఎంతో అభివృద్ధి..
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వైద్య వ్యవస్థలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రస్తుత వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ నగరంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో రెండు వేల పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నామన్నారు. కొత్తగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైందని.. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలు సేకరించి.. అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.