NTR30: మ‌నుషులు కాదు మృగాలే.. హైప్ పెంచేస్తున్న కొర‌టాల‌

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. ఎట్టకేలకు ఎన్టీఆర్​30 పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30 షూటింగ్​ ప్రారంభోత్సవం మార్చి 23న అతిరథ మహారథుల మధ్య అట్టహాసంగా మొదలయ్యింది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్ విచ్చేయగా పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరింత ప్రత్యేకం. ఈ సినిమాలో పని చేస్తున్న ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి నటులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ చాలాకాలం తర్వాత మీడియాతో మాట్లాడారు. బయట ప్రపంచానికి తెలియని ఒక కోస్టల్ ప్రాంతంలో ఈ కథ జరుగుతుందని దేవుడికి సైతం భయపడని ఎన్నో మృగాల మధ్య బ్రతుకుతున్న జనాల కోసం ఒకడొస్తాడని ఆ థీమ్ మీద ఈ కథ ఉంటుందని క్లూ ఇచ్చారు. కెరీర్ బెస్ట్ ఇస్తానని అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకుండా ఉండేలా తీస్తానని హామీ ఇచ్చేశారు.

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. రైటర్ కమ్​ డైరెక్టర్ కొరటాల శివ వరుసగా చేసిన నాలుగు చిత్రాలు టాప్ హీరోలతో చేయడం.. అవి నాలుగూ సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలుగా మారడం.. టాలీవుడ్లో ఇదొక అరుదైన రికార్డు. చాలా తక్కువ సమయంలో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగిపోయారు కొరటాల. భారీ చిత్రాలతో బాక్సాఫీస్ సక్సెస్‌ ఎలా సాధించాలో ఔపోసన పట్టేశాడని.. ఆయనకు ఫెయిల్యూర్ అన్నదే ఉండదనే చాలామంది నమ్మారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరురు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘ఆచార్య’ దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. వరుసగా నాలుగు సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన దర్శకుడు కాస్త తడబడి, రిజల్ట్ కొంచెం తేడా కొడితే ఓకే కానీ.. మరీ అంత పెద్ద డిజాస్టర్ ఇవ్వడంతో అభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆ సినిమా రిజల్ట్ తర్వాత కూడా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా సక్సెస్ అందుకుని, తిరుగులేని మార్కెట్ సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్​తో సినిమా తీసేందుకు ధైర్యం చేశాడంటే నిజంగా కొరటాల తన కథ మీద నమ్మకంతోనే ముందుకెళ్తున్నాడని టాలీవుడ్​ టాక్​.

ఇక ఎన్టీఆర్​ సినిమాని ఒక నెల రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు యూనిట్ టాక్. శంషాబాద్ పరిసరాల్లో షూట్ చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకొవడంతో తారక్ ఫ్యాన్స్ చాలా వెలితిగా ఫీలవుతున్నారు. రిలీజ్ కోసం ఇంకో ఏడాది వెయిట్ చేయాలి కాబట్టి కొరటాల నుంచి జనతా గ్యారేజ్ కి పది రెట్లు ఎక్కువనిపించే అవుట్ ఫుట్ ని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే స్క్రిప్ట్ విషయంలో రాజీ పడకుండా ఇంత ఆలస్యం చేస్తూ వచ్చారు. ఈ పాన్​ ఇండియా మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉండబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు రిలీజ్​ చేసిన పోస్టర్లు చూస్తే కాస్త ఫ్యాక్షన్​ టచ్​ కూడా ఉంటుందని, మాస్​ అండ్​ యాక్షన్​ ఫిలింలో మరోసారి ఎన్టీఆర్​ని చూడవచ్చని టాలీవుడ్​ టాక్​. కథేంటనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.