NTR30 : బ్లడ్​ ట్యాంకర్​ పిక్​ లీక్​.. కావాలని చేసిందేనా!

టాలీవుడ్​లో ఒక్కో హీరోకి ఒక్కో రకమైన ఫ్యాన్​ బేస్​ ఉంది. వారి అభిమాన నటుడి పుట్టినరోజు, సినిమా రిలీజ్​లు అంటే వాళ్లు చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఇక, ఈతరం హీరోల్లో క్లాస్​, మాస్​ ఫ్యాన్​ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్​ పేరు ముందుంటుంది. ఆర్​ఆర్​ఆర్​లో కొమురం భీమ్​ పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు తారక్​. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్​ తీయబోయే సినిమాపై ఏడాదికాలంగా నెలకొన్న సంశయం తాజాగా విడిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న NTR30 షూటింగ్​ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇక ఈ సినిమా నుంచి రాబోయే అప్​డేట్స్​పైనే అభిమానుల ఆరాటం. అయితే ఈ విషయాన్ని గ్రహించిన మేకర్స్​ షూటింగ్​ల నుంచి అప్పుడప్పుడూ ఫొటోలు, మేకింగ్​ వీడియోలు లీక్​ చేస్తూ సినిమాపై హైప్​ పెంచుతూ ఉంటారు. తాజాగా NTR30 విషయంలోనూ అదే జరిగినట్టు తెలుస్తోంది. NTR30 అని రాసున్న ఒక బ్లడ్​ ట్యాంకర్​ ఫొటో సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జనతా గ్యారేజ్​తో సూపర్​ హిట్​ ఇచ్చిన కొరటాల శివ మరోసారి యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​తో NTR30 సినిమా ప్రారంభించారు. వీరి కాంబినేషన్లో సాగే #NTR30 లాంచింగ్ ఇటీవలే జరిగింది. వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని కొరటాల చేసిన కామెంట్స్​ అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. ప్రస్తుతం #NTR30 కి సంబంధించి ఓ ఫొటో హాట్ టాపిక్ గా మారింది. #NTR30 పేరుతో ఉన్న ఓ బ్లడ్​ ట్యాంకర్ ఫొటో లీక్ అవడంతో ఎన్టీఆర్ కోసం ఏకంగా బ్లడ్ ట్యాంకర్ నే తెచ్చారన్న చర్చ సాగుతోంది.
టాలీవుడ్ యంగ్ టైగర్​గా పేరు సంపాదించుకున్నతారక్​ సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. కొంత మంది డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్ యాక్షన్ తగినట్లుగా కథను తీర్చిదిద్దుతారు. ఆర్ఆర్ఆర్ లో తారక్​, రామ్​ చరణ్​ ఇద్దరు నటించినా ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ భారీ యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తారక్​ ఏకంగా పులితో ఫైట్ చేయడం థియేటర్లలో కేక పెట్టించింది. దీంతో ఎన్టీఆర్ ఎలాంటి యాక్షనైనా చేయగలడని ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

జనతా గ్యారేజ్​కు మించి NTR30 సినిమా ఉండబోతుందని కొరటాల హింట్ ఇచ్చాడు. ఇప్పటికే #NTR30 కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో తారక్​ కత్తి చేత పట్టుకొని కనిపించారు. ఆ కత్తి మొత్తం రక్తంతో తడిసి ఉంటే.. చుట్టూ సముద్రం అల్లకల్లోలమైన దృశ్యాన్ని చూపించారు. ఈ నేపథ్యంలో NTR30 పేరుతో ఉన్న బ్లడ్ ట్యాంకర్ పిక్ ను కావాలనే లీక్​ చేసినట్లు టాలీవుడ్​ టాక్​. స్టార్​ హీరోల సినిమాలకు లీకుల సమస్య కొత్తేమీ కాకపోయినా అభిమానులు మాత్రం ఎప్పుడు ఏ అప్​డేట్​ వస్తుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు. అయితే ఇది నిజంగానే బ్లడ్ ట్యాంకరా? లేక ట్యాంకర్ పై ఫైట్ సీన్ జరిగిందా? అనేది తెలియదు. ఏదీ ఏమైనా ఈ బ్లడ్ ట్యాంకర్ ను చూస్తే #NTR30 సినిమా రక్తమోడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయేమోనని చర్చించుకుంటున్నారు అభిమానులు. ఏ విషయమైనా కచ్చితంగా తెలియాలంటే అధికారికంగా మేకర్స్​ అప్​డేట్స్​ ఇచ్చేవరకు వేచి ఉండాల్సిందే!