ఎయిర్​పోర్ట్​లో ఎన్టీఆర్.. ప్రయాణం అక్కడికేనా!

చలనచిత్ర రంగంలో అత్యుత్తమైన అవార్డుగా ప్రఖ్యాతి గాంచినది ఆస్కార్. ఈ అవార్డు వేడుకల కోసం ప్రపంచమంతా ఆసక్తిగా. 95వ ఆస్కార్ అవార్డుల వేడుక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గర ప‌డుతోంది. లాస్ ఏంజిల్స్ వేదిక‌గా మార్చి 12న జ‌ర‌గ‌నున్న ఈ వేడుకల కోసం మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శక‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ కుడు కీరవాణి, కార్తికేయ‌న్ త‌దిత‌రులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా వెళ్లలేదు. దీనిపై రకరకాల వాదనలు వినిపించాయి. అయితే.. నంద‌మూరి హీరో, ఎన్టీఆర్‌కు అన్నయ్య తారాక‌ర‌త్న ఇటీవలే కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోవ‌డానికి ఎన్టీఆర్‌కు కాస్త సమ‌యం ప‌ట్టింది. కాగా, తాజాగా ఎన్టీఆర్ అమెరికా బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆయన ఎయిర్పోర్ట్లో సోమవారం ఉదయం కెమెరాల కంటికి చిక్కడంతో అభిమానులంతా సంబరపడిపోతున్నారు.

ఎన్టీఆర్ హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వెళ్లిన వీడియోలు ప్రస్తుతం వైర‌ల్ అవుతున్నాయి. తారక్ అభిమానులు దీనిపై నెట్టింట సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో రామ్ చ‌ర‌ణ్ స్థానిక మీడియాతో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూనే ఉన్నారు. అంతేకాదు మార్చి 3న RRR సినిమాను అక్కడ 200 పైగా స్క్రీన్స్‌లో రీ రిలీజ్ చేశారు. అమెరికాలోని అభిమానుల కోసం స్పెష‌ల్ షోస్ వేసి వారితో RRR టీమ్ ప్రత్యేకంగా ఇంట‌రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ టీమ్‌తో ఎన్టీఆర్ కూడా కలిసి సందడి చేయనున్నారు.
ఆర్​ఆర్​ఆర్​ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (హిందీ), జీ5(తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోనూ అధిక వ్యూస్​తో దుమ్ము రేపుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేయగా, వీరికి జంటగా హాలివుడ్​ నటి ఒలివియా మోరీస్, బాలీవుడ్​ నటి ఆలియా భట్ నటించారు. బాలీవుడ్​ నటుడు అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు.

ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత అవార్డ్‌లను సైతం గెలుచుకుంటోంది. అందులో భాగంగా ఆర్ ఆర్ ఆర్ నుంచి నాటు నాటు పాట ఆస్కార్‌ అవార్డ్‌కు నామినేట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట నామినేట్ అయ్యింది. మరి ఈ పాట ఆస్కార్ అందుకుంటుందో లేదో తెలియాలంటే మార్చి 12 వరకు ఆగాల్సిందే!