Rana Naidu: ఫ్యామిలీతో చూడొద్దంటూ నెట్‌ఫ్లిక్స్ రిక్వెస్ట్
విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ మ్యాన్ అని అంటుంటారు ఆయన్ని. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు అభిమానులు తమ కుటుంబంతో కలిసి హాయిగా రెండున్నర గంటలు ఎంటర్‌టైన్ చేసేలా ఉంటాయి. కానీ ఒక్కసారిగా ఈ ఇమేజ్‌కు బ్రేక్ వేస్తూ.. ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచింది రానా నాయుడు. వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇది. తెలుగు, హిందీలోనూ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్‌లో కూడా ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతగానో ఎదురుచూసారు. శనివారం ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. పాపం ఫ్యాన్స్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చూద్దాం అనుకున్నారు కానీ ఫస్ట్ ఎపిసోడ్‌లోనే మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటం, ఇలాంటి సన్నివేశాలు ఉన్న సిరీస్‌లో వెంకటేష్ నటించడం ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేసింది. ఈ వెబ్ సిరీస్‌లో శృంగార సన్నివేశాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. దీనిని రిలీజ్ చేసిన ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కూడా దయచేసి ఫ్యామిలీతో చూడకండి అంటూ ట్విటర్ వేదికగా రిక్వెస్ట్ చేసింది. అభిమానులతోపాటు సినీ ప్రముఖులు కూడా ఇలాంటి సిరీస్‌ని దగ్గుబాటి హీరోల నుంచి ఊహించలేదని కామెంట్ చేస్తున్నారు.
సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ పై వ్యతిరేకత చోటు చేసుకుంది. అయినప్పటికీ ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అయితే రానా నాయుడు విషయంలో చోటుచేసుకున్న వ్యతిరేకతపై తాజాగా దగ్గుబాటి రానా రియాక్ట్ అయ్యారు. తమ వెబ్ సిరీస్ ని ఆదరించిన ప్రేక్షక లోకానికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసిన రానా.. ఈ వెబ్ సిరీస్ కుటుంబంతో కలిసి చూడొద్దు అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒంటరిగా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకటేష్.. రీసెంట్‌గా వరుణ్ తేజ్‌తో కలిసి F3 రూపంలో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే తన అన్న సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి రానాతో కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ విమర్శల పాలవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్నాళ్లు లవ్, ఫ్యామిలీ, ఎమోషన్ చిత్రాలతో అలరించిన వెంకటేష్.. ఇలాంటి సినిమా చేస్తారని ఊహించలేదంటూ బోలెడన్ని కామెంట్లు వస్తున్నాయి. తమ సిరీస్ చూసి హర్ట్ అయిన వారికి సారీ అంటూ రానా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ సిరీస్‌లో బూతులను ప్రామాణికంగా తీసుకోకుండా వెంకటేష్, రానా నటనను లెక్కలోకి తీసుకుని పరిగణించాలనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ సిరీస్‌లో కంటెంట్ అభ్యంతకరంగా ఉంటుంది కాబట్టే ప్రమోషన్స్‌లోనే వెంకటేష్, రానా ప్రేక్షకులను కుటుంబంతో కాకుండా ఒంటరిగా సిరీస్ చూడాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.