“యూట్యూబ్‌ చూసి.. నవీన్‌ అవయవాలు కోసేశా”

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవీన్‌ హత్య కేసులో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నవీన్‌ను హతమార్చిన నిందితుడు హరిహర కృష్ణ పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలను వెల్లడిస్తున్నాడు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు తెల్లవారుజాము మూడు గంటలకు సంఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. దీనిలో భాగంగా ముందుగా మూసరంభాగ్‌లోని సోదరి ఇంటికి హరిహరకృష్ణను తీసుకెళ్లారు. హరిహరకృష్ణను ఆమె సోదరిని పోలీసులు పలు ప్రశ్నలు వేశారు. అనంతరం అంబర్‌పేట్‌లోని తిరుమల వైన్స్ వరకు నిందితుడిని తీసుకువెళ్లారు. అక్కడి నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. హత్య జరిగిన తీరును హరిహరను అడిగి తెలుసుకున్నారు. హత్య తర్వాత బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకున్నట్లు హరిహరకృష్ణ చెప్పడంతో పోలీసులు అక్కడికి కూడా వెళ్లారు. హసన్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు హత్య చేయడం అవయవాలు కోసేయడం ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదని పోస్టుమార్టం నిర్వహించే వైద్యులు చెబుతుండటంతో ఆ దిశగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు ఇంకా ఎవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మూడు నెలల నుంచే ప్లాన్‌ గీసిన హరిహర..
నవీన్‌ను హత్య చేయాలని దాదాపు మూడు, నాలుగు నెలల నుంచే పథకం రచించినట్లు నిందితుడు హరిహరకృష్ణ పోలీసులుకు వెల్లడించాడు. అందుకు గాను ముందుగానే మార్కెట్‌లో కత్తి కూడా కొనుగోలు చేశాడు. దీంతోపాటు నవీన్‌ను హత్య చేసిన తర్వాత అతని అవయవాలను కూడా వేరు చేయాలని నిర్ణయించుకున్నట్లు విస్తుపోయే నిజాలను వెల్లడించాడు. అవయవాలు ఏ విధంగా వేరు చేస్తార అన్న విషయాలను యూట్యూబ్‌లో ఉండే పోస్టుమార్టం వీడియోలను చూసినట్లు హరిహర పోలీసులకు వివరించాడు. ఆ వీడియోలను చూసి నవీన్ తల, గుండె, మర్మాంగాలను వేరు చేసినట్లు అతను చెప్పాడు. అయితే.. ఒక్కడే ఇవన్నీ చేయకపోవచ్చని నిపుణులు భావిస్తున్న తరుణంలో మరికొందరిని ఈ కేసులో విచారించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

నా కొడుకు సీఐడీ చూసేవాడు..
నవీన్‌ హత్య ఉదంతంపై హరిహర కృష్ణ తండ్రి స్పందించాడు. తన బిడ్డకు గతంలో ఎలాంటి నేర పూరిత ఉద్దేశాలు లేవని.. నవీన్‌ హత్య వెనుక మరికొందరు ఉన్నారని ఆరోపించాడు. దీంతోపాటు ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు సీఐడీ కార్యక్రమం చూసేవాడని.. అంతకుమించి మరే ఇతర వీడియోలు చూసేవాడు కాదని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం హరిహర కృష్ణ పోలీసుల విచారణంలో తాను యూట్యూబ్‌లో పోస్టు మార్టం వీడియోలు చూశానని చెప్పడం సంచలనంగా మారింది.