పవర్‌స్టార్ టైటిల్‌తో నేచురల్ స్టార్ సినిమా!
నేచురల్ స్టార్ నాని భిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్నారు. ఓ వైపు వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ ఎంటర్టైనర్స్తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఇక, మార్చి 30న దసరా చిత్రంతో తొలిసారి పాన్ ఇండియా ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నారు నాని. మరో వైపు శౌర్య అనే డెబ్యూ డైరెక్టర్‌తో తన 30వ సినిమా ప్రారంభించిన నాని, వివేక్ ఆత్రేయతోనూ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, ఈమధ్యనే నానికి ఓ స్టార్ ప్రొడ్యూసర్ నుంచి సినిమా చేయాలనే కబురు అందిందట. ఆ నిర్మాత ఎవరో కాదు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు.
దాదాపు ఆరేళ్ల ముందు దిల్ రాజు నానితో ఎంసీఏ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. భూమిక కీలక పాత్రలో నటించింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ విలన్‌గా నటించాడు. ఎంసీఏ కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఆడియెన్స్‌ను మెప్పించింది. ఇప్పుడు కూడా అలాంటి కమర్షియల్ సినిమానే శ్రీరామ్ వేణు డైరెక్షన్లో నానితో చేయడానికి దిల్ రాజు ఆసక్తిగా ఉన్నారట. నాని, దిల్‌రాజు, శ్రీరామ్ వేణు సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయనీ, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని టాలీవుడ్ టాక్. అంతేకాదు, మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ తమ్ముడు టైటిల్‌నే పెట్టాలని ప్లానింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ప్రాజెక్ట్ అంతా ఓకే అయితే తమ్ముడు టైటిల్ పెట్టటానికి మెగా, పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా, లేదా అనేది చూడాలి. శ్రీరామ్ వేణు ఇంతకు ముందు కూడా దిల్ రాజు బ్యానర్లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. అప్పటి నుంచి ఆయన మళ్లీ నాని కోసం కమర్షియల్ ఎంటర్టైనింగ్ కథను సిద్ధం చేస్తూ వచ్చారు. ఇప్పుడు దానికి సంబధించిన చర్చలే నడుస్తున్నాయి. ఇక నాని తన తాజా సినిమా దసరా ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న దసరా సక్సెస్ కోసం ఇటు దక్షిణాదితోపాటు అటు ఉత్తరాదిని కూడా కవర్ చేస్తూ ముంబై, లక్నో నగరాల్లో పర్యటించారు.