ఉత్తరాదిపై కన్నేసిన నేచురల్​ స్టార్​!

బాహుబలి, పుష్ప, ఆర్​ఆర్​ఆర్​, కేజీఎఫ్​ దెబ్బకి సౌత్​ సినిమా కాస్తా పాన్​ ఇండియా సినిమాగా మారిపోయింది. దక్షిణాది స్టార్​ హీరోలందరూ పాన్​ ఇండియా సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నారు. ఇక ఆర్​ఆర్​ఆర్​ ఆస్కార్​ కొట్టి టాలీవుడ్​ సినిమాని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక ఇప్పుడు పాన్​ ఇండియా హీరోల లిస్ట్​లో నేచురల్​ స్టార్​ నాని చేరబోతున్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘దసరా’ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించగలదని నమ్మిన నాని దీన్ని పాన్​ ఇండియా సినిమాగా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాదిన ప్రమోషన్స్​ ప్రారంభించిన నాని ముంబైలో హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక తాజాగా ఉత్తర్​ప్రదేశ్​లోని లక్నోలో పర్యటించి అభిమానులను పలకరించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

నాని, కీర్తి సురేష్​ హీరోహీరోయిన్లుగా నటించిన‘దసరా’ సినిమా ఈనెల 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్​తో బిజీగా ఉంది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా ‘దసరా’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టిన నాని ట్రైలర్‌ను ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో విడుదల చేశారు. నగరంలోని ప్రతిభ థియేటర్‌లో ఈరోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో నాని, నిర్మాత చెరుకూరి సుధాకర్, నటుడు దీక్షిత్ శెట్టి పాల్గొన్నారు.

నాని రాకతో లక్నోలో సందడి వాతావరణం కనిపించింది. సినీ ప్రేమికులు నానీకి ఘనస్వాగతం పలికారు. ప్రతిభ థియేటర్ వద్ద లారీ ఎక్కి ఆడియన్స్‌లో ఊపు తీసుకొచ్చారు నాని. ట్రైలర్ లాంచ్ అనంతరం నానితో పాటు నిర్మాత చెరుకూరి సుధాకర్, నటుడు దీక్షిత్ శెట్టిహిందీ మీడియాతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అనంతరం లక్నోలో ప్రముఖ రెస్టారెంట్ రాయల్ కేఫ్‌కు ‘దసరా’ టీమ్‌తో కలిసి వెళ్లిన నాని, అక్కడ ప్రత్యేకమైన చాట్‌ను టేస్ట్ చేశారు. అంతేకాదు, రెస్టారెంట్‌లో చెఫ్ వివరిస్తుంటే నాని స్వయంగా చాట్ తయారుచేశారు. దాన్ని రెస్టారెంట్‌కు వచ్చిన కొంత మంది కస్టమర్లకు సెర్వ్ చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు హీరోలంతా హిందీ మార్కెట్‌లో ప్రచారం కోసం ముంబై వెళ్తే.. నాని డిఫరెంట్‌గా లక్నో వెళ్లి అందరినీ చూపును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మరి నాని ఎంతవరకు సక్సెస్​ అయ్యారో తెలియాలంటే ఈ నెల 30 వరకు ఆగాల్సిందే!