“నాటు నాటు” అసలు పాటేనా? కీరవాణి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంపై యావత్ భారత్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాతో తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్‌ఆర్‌ఆర్ దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని మెప్పించి ఆస్కార్ చేజిక్కించుకుంది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి నాటు నాటు పాట పాడారు. కీరవాణి, రాజమౌళి కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక రకంగా ఈ సినిమాతో సంబంధం కలిగి ఉన్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకి కథను అందించగా, రాజమౌళి కొడుకు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అందుకే ఆస్కార్ విజయంతో రాజమౌళి, కీరవాణిల ఫ్యామిలీ ఆనందం మాటల్లో చెప్పలేం. కొడుకు ఉన్నతిని చూసి ఉప్పొంగిపోయాడు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా. అయితే అదే సమయంలో ఆయన నాటు నాటు పాటపై చేసి ఘాటు కామెంట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
‘నాకు సినిమా అంటే ప్యాషన్. మేము నలుగురు అన్నదమ్ములం. మేమంతా తుంగభద్ర ఏరియాకు వలస వెళ్లాం. అక్కడ 16 సంవత్సరాలు ఉన్నాం. ఆ ప్రాంతంలో 300 ఎకరాలు కొన్నాను. కానీ సినిమా కోసం భూమినంతా అమ్మేశా. చివరికి ఈరోజు పూట గడవడం ఎలా? అన్న పరిస్థితికి వచ్చాం. ఆ సమయంలో విజయేంద్రప్రసాద్, నేను కలిసి మంచి మంచి కథలు రాశాం. జానకిరాముడు, కొండవీటి సింహం.. ఇలా ఎన్నో హిట్ సినిమాలకు మేము పని చేశాం! కానీ అప్పటిదాకా కీరవాణి చక్రవర్తి దగ్గర పని చేస్తే వచ్చిన డబ్బుతో ఇల్లు గడిచేది. కీరవాణి నా పంచప్రాణాలు. మూడో ఏట నుంచే అతడికి సంగీతం నేర్పాను. తన టాలెంట్ చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌లో నాటు నాటు పాట నాకు నచ్చలేదు. అసలు అది ఒక పాటేనా?’ అంటూ వ్యాఖ్యానించారు శివశక్తి దత్తా. ఇటీవల విజయేంద్రప్రసాద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆస్కార్‌లో ఇరవై కేటగిరీలు ఉంటే కేవలం ఒక్క కేటగిరీలోనే నాటు నాటు పాటకు అవార్డు దక్కిందని, మనం ఇంకా మంచి సినిమాలు చేయాలనీ అన్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల మాటలు విని ఆశ్చర్యపోవడం అభిమానుల వంతవుతోంది. కొడుకులు ప్రపంచాన్ని మెప్పించినా వాళ్ల తండ్రులను మాత్రం మెప్పించలేకపోయారని సరదాగా కామెంట్ చేస్తున్నారు.