రజినీకాంత్ నిర్ణయం వల్లే ఆ సినిమా ఫెయిలైంది
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్లలో ఒకరు ఏ.ఆర్ మురుగదాస్. ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకోని నటులు ఉండరనే చెప్పాలి. అయితే.. ఈ మధ్యకాలంలో కాస్త దర్శకత్వాన్ని పక్కనపెట్టి నిర్మాతగా మారారు మురుగదాస్. ఆయన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రం 16 ఆగస్ట్ 1947. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మురుగదాస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ సినిమా దర్బార్ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. అయితే అందుకు కారణం సూపర్‌స్టార్ రజినీకాంత్ నిర్ణయమేనని మురుగదాస్ అన్నారు.
దర్బార్ సినిమాలో రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. దీని గురించి మురుగదాస్ మాట్లాడుతూ.. “సినిమా హిట్, ఫ్లాప్ అవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రతి సినిమాను తొలి సినిమాలాగే భావించి తీస్తాం. దర్బార్ కథను రజినీ సర్‌కు చెప్పినప్పుడు ఆయన మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. ముంబైలో షూటింగ్ అనుకున్నాం కాబట్టి.. అక్కడ వర్షాలు జూన్‌లోనే ఎక్కువగా పడతాయి. మరోపక్క రజినీ సర్ ఆగస్ట్‌లో తన పొలిటికల్ పార్టీని ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. నేను రజినీ సర్‌కు వీరాభిమానిని. ఏదేమైనా ఆయన్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ పోగొట్టుకోకూడదు అనుకున్నా. దాంతో వేగంగా షూటింగ్ చేయాల్సి వచ్చింది. అలా సినిమా ఎప్పుడు రాబోతోందో ముందే ప్రకటించేసాం. అయితే బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ నాకు ఒక విషయం చెప్పారు. మనం సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తామో ముందే చెప్తే 50% సినిమా ఫ్లాప్ అయినట్లేనని. ఆ మాట నిజమేనని నాకు దర్బార్ సినిమా సమయంలో అర్థమైంది” అని తెలిపారు మురుగదాస్.