అవినాష్ రెడ్డికి హైకోర్డులో షాక్.. ఢిల్లీలో జగన్‌తో భేటీ!
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసులో తనపై సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకూడదని హైకోర్టును అవినాష్ ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగగా.. వైఎస్ అవినాష్ రెడ్డి మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే.. సీబీఐ విచారణకు తాము అడ్డు చెప్పమని.. విచారించే సమయంలో అవినాష్ రెడ్డి ఆడియో, వీడియో రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అవినాష్ తరపు న్యాయవాదిని మాత్రం విచారించే ప్రాంతానికి అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది. అవినాశ్‌రెడ్డిని ఇప్పటికే నాలుగుసార్లు పిలిపించి సీబీఐ ప్రశ్నించింది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పైనా దృష్టి సారించింది. తండ్రీకొడుకులిద్దరినీ కలిసి ఈ సారి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వీరిద్దరినీ అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నట్లు సీబీఐ వర్గాల నుంచి తెలుస్తోంది. వాస్తవానికి హైకోర్టు జోక్యం చేసుకోకపోతే ఈ నెల 10న అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసేది. అవినాశ్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు వెలువడేదాకా ఆయనను అరెస్టు చేయవద్దని హైకోర్టు సీబీఐని ఆదేశించిన క్రమంలో ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని సమాచారం.
ఢిల్లీకి వెళ్లిన జగన్‌తో అవినాష్ రెడ్డి భేటీ కావడం గమనార్హం. ఢిల్లీలోని జగన్ నివాసంలోనే ఈ సమావేశం జరిగింది. వివేకా హత్య కేసు నుంచి తమ్ముడిని బయటపడేసేందుకు జగన్ ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి కూడా జగన్‌తో ఢిల్లీలో భేటీ కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది. అవినాష్ రెడ్డి తనతో భేటీ అయిన గంటల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంట్‌లో జగన్ భేటీ కావడం కొసమెరుపు.
ఢిల్లీలో జగన్‌తో అవినాష్ భేటీ..
తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించలేమని తేల్చిచెప్పిన తరుణంలో సీఎం జగన్ ను ఢిల్లీలో అవినాష్ భేటీ కావడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉన్నందున ఈ కేసుకు సంబంధించి విషయాలను సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చి ఉండవచ్చని సమాచారం. రాష్ట్ర సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని అధికార వైసీపీ చెబుతున్నప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం, వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆయా విషయాలపై మాట్లాడేందుకే కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్దకు సీఎం జగన్ వెళ్లారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
అవినాష్‌ను 17న అరెస్టు చేస్తారా..
ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి 41A నోటీసులు ఇవ్వాలనుకుంటున్నట్లు సీబీఐ నుంచి వస్తున్న సమాచారం. విచారణ తర్వాత అవినాశ్‌రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో మార్చి 17న అనగా శనివారం అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.