ఈ ఏప్రిల్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు!
ఈ సంవత్సరం మొదలై అప్పుడే మూడు నెలలు గడిచిపోయింది. ఫస్ట్ క్వార్టర్లో టాలీవుడ్ నుంచి వచ్చిన చాలా సినిమాలు బాక్సీఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, బలగం, ధమ్కీ, దసరా సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. చిన్న సినిమాలుగా విడుదలైన బలగం, రైటర్ పద్మభూషణ్, వినరో భాగ్యము విష్ణుకథ వంటి సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించి భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఇక, ఏప్రిల్‌లోనూ విడుదలయ్యేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఈ నెలలో విడుదల కానున్న సినిమాలేవో తెలుసుకుందాం..
రావణాసుర
మాస్ మహారాజ రవితేజ చిత్రంతోనే ఏప్రిల్ నెలలో సినిమా పండగ షురూ కానుంది. క్రాక్, ధమాక సినిమాల వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్న రవితేజ ‘రావణసుర’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ సంస్థలు నిర్మించాయి. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అదించారు. సుశాంత్, హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో అలరించబోతున్నారు.
దేశముదురు
డాషింగ్ డైరెక్టర్ పూరీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సినిమా దేశముదురు. బన్నీకి కెరీర్ పరంగా ఈ సినిమా చాలా ప్లస్ అయ్యింది. ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులకు బాగా చేరువై ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు బన్నీ. హన్సికా మోత్వాని తెలుగు పరిశ్రమకు ఈ సినిమా ద్వారానే పరిచయం అయ్యారు. డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఓ సంచలనం. దివంగత సంగీత దర్శకుడు చక్రీ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇక, అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్‌గా ఏప్రిల్ 7న ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మీటర్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో మంచి హిట్ అందుకున్న కిరణ్ మరో సినిమాతో రాబోతున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ‘మీటర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ యంగ్ హీరో ఏకంగా మాస్ మహారాజతోనే పోటీపడుతుండటం ఆసక్తికర విషయం.
శాకుంతలం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ గుణశేఖర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు మేకర్స్. ఈ సినిమాకి మణిరత్నం సంగీతం అందించగా సమంత – దేవ్ మోహన్ జంటగా నటించారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతోంది.
బిచ్చగాడు2
విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘బిచ్చగాడు2’. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బికిలి ట్యాగ్‌లైన్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు విజయ్. బిచ్చగాడు మొదటి భాగం అనూహ్యంగా హిట్ అయ్యింది. దాంతో బిచ్చగాడు2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్టుగానే విజయ్ ఆంటోని ఈ సినిమాపై ఆసక్తిని పెంచేలా వరుసగా పాటలు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ప్రియా కృష్ణ స్వామి దర్శకత్వం వహిస్తున్న బిచ్చగాడు2 సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది.
విరూపాక్ష
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన విరూపాక్ష సినిమా కూడా ఈ నెలలోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలను పెంచేసిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో కార్తీక్ దండు టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కన్నడ భామ సంయుక్తా హెగ్డే, సాయి ధరమ్ తేజ్‌కి జోడీగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగాను వ్యవహరిస్తుండటంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.
నేను స్టూడెంట్ సార్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లకొండ గణేష్ నటించిన ‘నేను స్టూడెంట్ సార్!’ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో గణేష్ కు జోడీగా అవంతిక దస్సని నటిస్తోంది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీ2 బ్యానర్ పై సతీష్ వర్మ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మహతీ స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఏజెంట్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ఏజెంట్’. అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించింది. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత రాంబ్రహ్మం ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ కానుంది.
పొన్నియన్ సెల్వన్ 2
చోళుల చరిత్ర ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ 1కి సీక్వెల్‌గా వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్ 2(PS2). ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ , కార్తీ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ , జయం రవి , త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం ఈతరం ప్రేక్షకులనూ బాగా ఆకట్టుకుంది. ఇక పొన్నియన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.