ఆరుగురిని బలితీసుకున్న మస్కిటో కాయిల్..!
దోమలను నియంత్రించడానికి వినియోగించే.. మస్కిటో కాయిల్ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతికి కారణమైంది. ఈ హృదయ విదారక సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇక మృతి చెందిన వారిలో ఏడాదిన్నర వయసు ఉన్న చిన్నారి కూడా ఉండటం మరింత బాధాకరం. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో మొత్తం తొమ్మది మంది ఉండగా.. వీరిలో ఆరుగురు విషవాయువులు పీల్చి చనిపోయారు. మిగిలిన ముగ్గురు కొన ఊపిరితో ఉండగా.. ఆసుపత్రికి తరలించారు.
ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసముంటోంది. ఎప్పటి లాగే.. గురువారం రాత్రి దోమలను తరిమేందుకు మస్కిటో కాయిల్‌ను వెలిగించి… దాన్ని పరుపు పక్కన పెట్టి పడుకున్నారు. ఈక్రమంలో అర్ధరాత్రి దాటాక.. ఆ కాయిల్ పరుపుపై పడింది. ఇక అది కాస్త.. మెల్లిగా అంటుకుని గదిలో పెద్ద ఎత్తున పొగ అలముకుంది. అప్పటికే కిటికీలు, తలుపులు కూడా పూర్తిగా మూసి ఆ గదిలో సుమారు తొమ్మిది మంది పడుకున్నారు. ఒక్కసారిగా పొగ తీవ్ర స్థాయిలో పెరగడంతో ఊపిరి అందక వారందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇక పరిస్థితిని గమనించి బయటపడేందుకు ప్రయత్నించినా విషపూరిత వాయువులను పీల్చి స్పృహతప్పి పడిపోయారు. శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. రాత్రంతా విషవాయువులు పీల్చడంతో అప్పటికే ఆరుగురు మృతిచెందారు. ముగ్గురిని మాత్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాయిల్ కారణంగా మంటలు చెలరేగి, ఆ తర్వాత వెలువడిన విషపూరిత వాయువులను పీల్చడంతో ఊపిరాడక ఆరుగురు చనిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.