BRSను కూల్చేందుకు మోదీ కుట్ర.. అందుకే నోటీసులు – కవిత ఫైర్
ఒకవైపు ఈడీ నోటీసులు.. మరోవైపు జంతర్ మంతర్ వద్ద మహిళ బిల్లు కోసం రేపు చేపట్టనున్న దీక్షకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలు వెల్లడించారు. ముందుగా మహిళా బిల్లు గురించి మాట్లాడిన కవిత.. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారని.. ఆమె చొరవతో బిల్లు రాజ్యసభలో పాసైనా ఆ తర్వాత ముందుకు కదల్లేదన్నారు. 2014, 2019 ఎన్నికల ప్రచారంలో బీజేపీ మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ చేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు చేయలేదని ఆమె తెలిపారు. మహిళలకు ఇతర దేశాల్లో ఉన్నంత ప్రాధాన్యం కూడా భారత్ లో లేదని అన్నారు. అందుకే ఈ బిల్లు కోసం పోరాటం చేస్తున్నట్లు వివరించారు. రేపు ఉదయం అనగా మార్చి 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష ఉంటుందన్నారు. ఈ దీక్షలో దేశంలోని సుమారు 18 పార్టీలకు చెందిన నాయకులు వచ్చి సంఘీభావం తెలియజేయనున్నట్లు కవిత పేర్కొన్నారు. వీరితోపాటు ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు పాల్గొంటాయని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ పంపిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈడీ విచారణ ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే ఈనెల 9న విచారణకు రావాలని ఈడీ నోటీసు ఇచ్చిందని.. దానికి బదులుగా 11న విచారణకు తమ ఇంటికే రమ్మని ఈడీని కోరానన్నారు. అందుకు ఈడీ అంగీకరించలేదన్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు విచారించరని కవిత ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు మహిళల ఇంటికి వచ్చి విచారించాలన్నది చట్టం చెబుతోందని, మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ఎన్నికల నేపథ్యంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ వస్తోందని కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది సాధ్యం కాకపోవడంతో తనను లక్ష్యంగా చేసుకున్నారని కవిత ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు బీఆర్‌ఎస్ నేతలను వేధిస్తున్నారని అన్నారు. మోదీ వన్ నేషన్ – వన్ ఫ్రెండ్ స్కీమ్ తెచ్చారని, విపక్షాలను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అధిక ధరలు, నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని ఆమె కేంద్రానికి సూచించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరగానే క్లీన్‌చిట్ ఇస్తున్నారని కవిత మండిపడ్డారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదని, ఎప్పటికీ ఏ టీమేనన్నారు. తన తండ్రి, సోదరుడితో పాటు పార్టీ మొత్తం అండగా ఉంటుందన్నారు. ఈడీ డైరెక్టర్, సెబీ డైరెక్టర్ లను పదవీకాలం అయ్యాక కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వారంతా మోడీ చెప్పినట్టు వింటున్నారు. పొడిగించాలని అనుకుంటే అగ్నివీర్ జవాన్లను పొడిగించండి. నాలుగేళ్లు శిక్షణ ఇచ్చి వదిలేస్తారా? దేశంలో డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ఒక ఇంజిన్ ప్రధాని, ఇంకో ఇంజిన్ అదానీ అని కవిత ఆరోపించారు.