బెంగళూరులో మోడీ మెగా రోడ్ షో!
Bangalore: కర్నాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికలకు(Assembly elections) సర్వం సిద్దమైంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అధికార, విపక్షాలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ(Narendra Modi) మెగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఉదయం బెంగళూరులో ప్రారంభమైన రోడ్ షో 26కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ ర్యాలీ దాదాపు 8గంటల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు సౌత్, బెంగళూరు సెంట్రల్‌తో పాటు 10కి పైగా నియోజకవర్గాల మీదుగా ప్రధాని ర్యాలీ కొనసాగనుంది. ప్రధాని వెంట బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య, సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఉన్నారు.
మోడీ భారీ రోడ్ షో కోసం బీజేపీ(BJP) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దారి వెంట ఆయనపై పూల వర్షం కురిపిస్తున్నారు. ఈ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ర్యాలీకి ముందు మోదీ ట్విటర్ వేదికగా ప్రజల అంచనాలు అందుకునే విధంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వ పాలన సాగుతుందని చెప్పారు.
కాగా, ఈ మెగా రోడ్ షోపై కాంగ్రెస్(Congress) విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని రోడ్ షో వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడింది. ఎగ్జామ్ టైం కావడంతో పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బంది పడుతారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాని మోడీ హింసాకాండతో అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్‌లో పరిస్థితిని పర్యవేక్షించడానికి వెళ్లలేదని ఆరోపించారు.