ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు.. భావోద్వేగంతో ఆఫీస్‌లోకి!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10-11 గంటల మధ్య ఆమె ఈడీ కార్యాలయంలోకి ప్రవేశించారు. నేడు విచారణలో రామచంద్రపిళ్లై కూడా పాల్గొననున్నారు. ఆయన్ని మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈడీ ప్రశ్నించనుంది. కవిత, రామచంద్ర పిళ్లై ఇద్దరిని మూఖాముఖిగా పెట్టి ఈడీ పలు ప్రశ్నలను సంధించనుంది. ఇక ఈడీ విచారణను ఏ విధంగా సమాధానం చెప్పాలి.. అసలు హాజరు కావాలా వద్ద అన్న అంశాలపై ఇప్పటికే కవిత న్యాయ నిపుణులను సంప్రదించినట్లు సమాచారం. అయితే.. విచారణకు హాజరుకాని పక్షంలో ఆమెను ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెప్పడంతో ఎట్టకేలకు ఇవాళ్టి విచారణకు కవిత హాజరయ్యారు. అయితే.. కవిత వెంట మంత్రి కేటీఆర్, ఆమె భర్త అనిల్, ఎంపీ సంతోష్ రావు, తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. ఈడీ విచారణ సందర్బంగా ఢిల్లీలోని కేసీఆర్ నివాసం, ఈడీ ఆఫీస్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.
సుప్రీంలో ఈడీ పిటిషన్ దాఖలు..
గతంలో ఈడీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో కవిత.. న్యాయవాదిని పంపించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కవిత పిటిషన్‌పై సుప్రీం కోర్టును ఈడీ ఆశ్రయించింది. కవిత పిటిషన్‌పై కేవీయట్ పిటిషన్ వేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ప్రకటించవద్దని ఈడీ సుప్రీం కోర్టును కోరింది.
ఈడీ కార్యాలయం వద్ద కవిత భావోద్వేగం..
ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు భర్తతో పాటు కవిత చేరుకున్నారు. అనంతరం ఆమె భర్త అనిల్‌ను ఆలింగనం చేసుకుని కవిత భావోద్వేగానికి గురయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో రెండో సారి ఈడీ విచారణకు కవిత వెళ్తున్న నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుందో సస్పెన్స్‌గా మారింది. ఇక ఈడీ విచారణకు వెళ్తున్న కవితకు ఆమె భర్త ధైర్యం చెప్పి ఆఫీస్‌లోకి పంపారు. కవిత, అరుణ్ పిళ్లై కలిపి ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపై కవితను ప్రశ్నించే అవకాశం ఉంది.