మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష చేస్తానంటున్న కవిత
మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ మేరకు ఆమె నివాసంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ పై బీజేపీ చర్చించిందని.. ఆ హామీని ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా కేవలం మూడు పార్లమెంటు సమావేశాలు మాత్రమే ఉన్నాయని, కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని అన్నారు.
తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తి పెంపొందించాలి అన్న లక్ష్యంతో పని చేసి, నేడు దేశవ్యాప్తంగా కూడా అదే పని చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందని గుర్తుచేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేయాలనే నిర్ణయించామని వెల్లడించారు.
మహిళలు రాజకీయ రంగంలో ముందు ఉండాలంటే రిజర్వేషన్ తోనే సాధ్యమవుతుందని భారత్ జాగృతి విశ్వసిస్తుందని తెలిపారు. మార్చి 10న ఢిల్లీలో దీక్ష చేస్తున్నామని, మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్ల క్రితం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన దేశాలు 2026 నాటికి లింగ సమానత్వ లక్ష్యాలను చేరుకుంటాయని తెలిపారు. కానీ రిజర్వేషన్ కల్పించని భారత్ వంటి దేశాలు ఆ లక్ష్యాన్ని చేసుకోవాలంటే 2063 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పారు. ఇందులో రాజకీయమేమీ లేదని, సగం జనాభాను ఇంట్లో కూర్చోబెట్టి దేశాన్ని సూపర్ పవర్, విశ్వగురువు గా చేయలేరని విమర్శించారు.
బీజేపీపై విమర్శలు..
గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం కనీసం జనగణన కూడా చేయలేదన్న ఎమ్మెల్సీ కవిత.. జనగణనతో పాటు, ఓబీసీ జనగణన సైతం చేయాలని డిమాండ్ చేశారు. 72వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారని, 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు పట్టణ స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రస్తుతం 21 రాష్ట్రాలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాయన్న ఎమ్మెల్సీ కవిత, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇప్పటికీ 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించడంతో పాటు, మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రత్యామ్నాయాలు కూడా సూచించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. మూడు నల్ల రైతు చట్టాలను పార్లమెంటులో ఆమోదించగలిగిన బీజేపీ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదానీ కుంభకోణంపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించలేదో చెప్పాలన్నారు.