MLA Kota MLC Elections- తొలి ఓటు వేసిన సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే.. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుకానుంది. అందర్నీ ఏకకాలంలో తరలించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. చంద్రబాబుతో కలిసే ఓటింగ్‌కి వెళ్లబోతున్న 19 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. వారితో చంద్రబాబు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే తొలి ఓటును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేశారు. ఇక మరోవైపు వైసీపీకి చెందిన 102 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఓటు వేసేందుకు అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఈ పోలింగ్ మొత్తం విప్ వర్సెస్ ఆత్మప్రబోధానుసారం కాన్సెప్ట్‌లో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం ఒకే సీటులో పోటీ చేస్తున్న టీడీపీ మాత్రం ఏవిధంగానైనా గెలిచి తీరుతామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వైసీపీ మాత్రం ఏడు సీట్లను కచ్చితంగా గెలిచితీరుతామని అంటోంది. ఎవరి ధీమా వాళ్లకు ఉన్నా.. అదేరీతిలో ఉత్కంఠ కూడా అందరిలో నెలకొంది.
రెబల్స్ అందరిలోనూ గుబులు..
టీడీపీ, వైసీపీ రెండు పార్టీలలోనూ రెబల్స్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక సభ్యుడు గెలుపొందాలంటే కనీసం 22 ఓట్లు అవసరం కాగా.. టీడీపీకి ప్రస్తుతానికి 19 మంది సభ్యుల బలం ఉంది. ఈ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇక వైసీపీకి మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీని విభేదిస్తున్నారు. మరోవైపు జనసేన నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ అటు టీడీపీ రెబల్ అభ్యర్థులు, జనసేన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేలు కలుపుకొంటే మొత్తం 154 మంది సభ్యుల బలం అధికారపార్టీకి ఉంది. కానీ వీరిలో ఎంత మంది పాల్గొంటారు.. ఎవరైనా క్రాస్ ఓటింగ్ వేస్తే ఏంటి పరిస్థితి అన్న దానిపై అధికార పార్టీలో కొంత ఆందోళన నెలకొంది.