బ్యాక్​ టు బ్యాక్​ సినిమాలతో జోరు మీదున్న మాస్​ మహారాజ్​!

ఈ ఏడాది ప్రారంభం నుంచే మాస్​ మహారాజ్​ రవితేజ మంచి స్పీడు మీదున్నారు. కొన్నాళ్లుగా ఫ్లాపులతో దోస్తీ చేస్తున్న రవితేజ పోయినేడాది చివర్లో ‘ధమాకా’తో మళ్లీ ఫామ్​లోకి వచ్చారు. ఈ ఏడాది ఆరంభంలోనే చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’లో కనిపించిన రవితేజ, ‘రావణాసుర’ సినిమాతో థియేటర్లకు రావడానికి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 7వతేదీన ఈ సినిమా విడుదలవుతోంది. కాగా, తాజాగా రవితేజ చేస్తున్న టైగర్​ నాగేశ్వర్​ రావు రిలీజ్​ డేట్​ని కూడా ప్రకటించేశారు మేకర్స్​. ఈ సినిమా అక్టోబర్​ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

రావణాసుర సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తించే విషయం. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా ఐదుగురు హీరోయిన్స్ కనిపించనున్నారు. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆయన తదుపరి సినిమా రిలీజ్ డేట్ గురించిన ప్రకటన కూడా వచ్చేయడం మరో విశేషం. రవితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1970 – 80లలో స్టువర్ట్ పురం గజదొంగగా పోలీసులకు నిద్రలేకుండా చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ ఇది. నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, దసరా పండుగ కానుకగా, అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మాస్, యాక్షన్, పంచ్ డైలాగులు, రవితేజ మార్క్‌ ఎనర్జీతో మాస్‌ మహారాజా రవితేజ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. రావణాసుర సినిమాలో క్రిమినల్ లాయర్‌‌గా నటిస్తున్నారు రవితేజ. నల్ల కోటు వేసుకుని సీరియస్ డైలాగులు చెబుతూనే, తన మార్క్‌ కామెడీ కూడా చేస్తున్నారు. ఇక, రావణాసుర సినిమాలో యాక్షన్ సీన్లు హైలైట్‌గా కనిపిస్తున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటించారు. ట్రైలర్‌‌లో రవితేజ యాక్షన్‌.. ఫ్యాన్స్‌ కు పూనకాలు తెప్పించేలా ఉంది. ‘అరెయ్ బాబ్జీ.. లైఫ్ లో వయలెన్స్ ఎక్కువైపోయి.. బొత్తిగా రొమాన్స్ లేకుండా పోతోంది రా’ అంటూ తన డిక్షన్‌లో డైలాగ్ తో ట్రైలర్‌‌లో ఎంట్రీ ఇచ్చారు రవితేజ. క్రిమినల్ లాయర్ గా కూడా తన మార్క్ ఎనర్జీ, యాక్షన్ సీన్స్ తో ఇరగదీస్తున్నారాయన. ఈ సినిమాలో హీరో సుశాంత్ స్పెషల్ క్యారెక్టర్ చేశారు. ముందుగా యాక్షన్ సీన్లతో స్టార్ట్ చేసినప్పటికీ మధ్యమధ్యలో కాస్త సరదా సీన్స్, చివరిలో మరోసారి యాక్షన్ సీన్లతో సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది ట్రైలర్​.

అభిషేక్ నామా, రవితేజ కలిసి అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల కింద రావణాసుర సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. ఇక, ఇప్పటికే రావణాసుర సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను అలరించాయి. సినిమాపై అంచనాలను కూడా పెంచేశాయి. రావణాసుర తర్వాత రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌ కూడా దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్​ 20న రిలీజ్​ చేయనున్నారు.