బెడిసికొట్టిన మేకప్…హాస్పిటల్‌లో వధువు
ఆడపిల్లకి పెళ్లంటే మేకప్, జ్యువెలరీ, చీరలు ఇలా ఎన్నో ఉంటాయి. పెళ్లికూతురిలా అందంగా ముస్తాబై కాబోయే భర్త చేత మూడు ముళ్లు వేయించుకోవాలని ఎంతో ఆరాటపడుతుంటుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ యువతికి మాత్రం పెళ్లి వేడుకే పీడకలలా మారింది. పెళ్లి రోజున అందంగా కనపడాలని ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఉన్న అందాన్ని పోగొట్టుకుని వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన ఓ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి మరో 10 రోజులు ఉందనగా.. స్థానికంగా ఉండే బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఆ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న ఓ యువతి.. కొత్త రకమైన మేకప్ వేస్తానని చెప్పి ముఖానికి ఫౌండేషన్ రాసి ఆవిరి పట్టింది. దాంతో ముఖమంతా బొబ్బలు వచ్చేసి అందవిహీనంగా అయిపోయింది.
అయితే పెళ్లి సమయానికి ముఖం అంతా బాగైపోతుంది అనుకుని పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేయాలనుకున్నారు వధువు తల్లిదండ్రులు. అప్పటికే విషయం వరుడికి తెలిసిపోవడంతో అతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. వధువు తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడినా అతను కనికరించలేదు.అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. ముఖం మీద బొబ్బలు రావడంతో వధువుని హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చింది. దాంతో వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు బ్యూటీ పార్లర్ ఓనర్ అయిన గంగ అనే యువతిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. వధువుకి వేసిన మేకప్ వల్ల అలెర్జీ వచ్చిందని తగ్గడానికి కాస్త సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. మేకప్ వంటివి వేయించుకోవడానికి బాగా అనుభవం ఉన్న వారి వద్దకే వెళ్లాలని తక్కువ డబ్బుకే మేకప్ వేస్తామని చెప్పేవారి వద్దకు వెళితే ఇలాంటి సమస్యలే వస్తాయని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.