నేడే జనసేన ఆవిర్భావ సభ.. వారాహి యాత్రలో మార్పులు
జనసేన పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతున్న తరుణంలో పదో వార్షికోత్సవ ఆవిర్భావ సభను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించన్నారు. ఈక్రమంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ -30 అమలులో ఉంటుందని చెప్పడం… మార్గంమధ్యలో ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని చెప్పడంతో వారాహి యాత్ర ఉంటుందా లేదా అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది. ఇక ఈ అంశంపై స్పందించిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా.. వారాహి యాత్రలో స్వల్ప మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.
వారాహిపై నుంచే పవన్ పర్యటన..
ముందుగా అనుకున్నట్లుగానే పవన్ కల్యాణ్ విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆటోనగర్ గేట్ వద్దకు రానున్నారు. అక్కడి నుంచి వారాహి పైన ఎక్కి మచిలీపట్నం వరకు యాత్రగా వెళ్లనున్నారు. మార్గంమధ్యలో తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్ , పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్), గూడూరు సెంటర్ ప్రాంతాల్లో జనసేన వీరమహిళలు, కార్యకర్తలు పవన్‌కు స్వాగతం పలుకుతారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ముందుగా ఎంపిక చేసిన ఈ అయిదు ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేదనీ… నిర్దేశించిన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు జనసైనికులు సిద్దంగా ఉండాలని సూచించారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తూ క్రమశిక్షణ పాటించాలనీ, వారాహి వాహనానికి ఏమాత్రం అడ్డు రాకుండా సభాస్థలికి ఎంతో జాగ్రత్తగా తీసుకు వచ్చేలా ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు. విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంపై పవన్ కల్యాణ్ మచిలీపట్నానికి బయలుదేరి వెళ్తారని అన్నారు.
వాలంటీర్లకు పలు సూచనలు…
సభా వేదిక పరిశీలన అనంతరం అక్కడే ఉన్న ఆవిర్భావ సభ వాలంటీర్లతో మనోహర్ మాట్లాడుతూ .. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవిర్భావ సభకు వాలంటీర్ల సేవలు చాలా కీలకమన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా వాలంటీర్లు పనిచేయాలని.. నిబంధనల ప్రకారం పక్కాగా వ్యవహరించాలని సూచించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరినీ గౌరవించి, వారిని ప్రత్యేకంగా చూసుకోవడం వాలంటీర్ల బాధ్యత అని.. పార్టీ ప్రతిష్ట పెంచేలా వాలంటీర్లు సేవలు ఉండాలన్నారు. పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకొని పని చేయాలని తెలిపారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తాగునీటి సదుపాయం, వైద్య సదుపాయం, మరుగుదొడ్లు కూడా ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం సభా ప్రాంగణాన్ని పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ గురించి ఆయా కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
400 మంది పోలీసులతో బందోబస్తు..
మచిలీపట్నం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ సందర్బంగా 400 మంది పోలీసులు, మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. పోలీస్ యాక్టు 30 అమల్లో ఉందని.. బైక్ ర్యాలీలు నిషేధం అని ఆయన చెప్పారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తుల తీసుకోవాలని.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ జాషువా హెచ్చరించారు.