రిజర్వేషన్ల మంత్రం..కర్నాటకలో బీజేపీని గెలిపిస్తుందా?

సరిగ్గా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా.. రిజర్వేషన్ల తుట్టెని కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కదిపింది. దీనిపై ఆ రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు కర్నాటక రాష్ట్రంలో ముస్లింలకు కేటాయించిన ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసింది. ఈ నిర్ణయంపై ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అయితే.. ఆ మేరకు రాష్ట్రంలోని ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్లను అధికార ప్రభుత్వం పెంచింది. ఇది తమకు కలిసి వచ్చే అంశమని బీజేపీ చెప్పుకొస్తోంది. కానీ మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం తమను రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే.. రిజర్వేషన్ల మార్పు జీవోను రద్దు చేసి.. పాత విధానంలోనే రిజర్వేషన్లు అమలయ్యేలా చేస్తామని చెబుతోంది. అసలు కర్నాటకలో రిజర్వేషన్లను ఎందుకు మార్చాల్సి వచ్చింది. దీని వల్ల రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి బెనిఫిట్‌ ఉంటుంది.. రిజర్వేషన్లు ఎవరికి ఎంత కేటాయించారు. ఇందులో నష్టపోయేది ఎవరు.. లాభ పడుతున్నది ఎవరు.. అన్న అంశాలపై ప్రత్యేక కథనం.

లింగాయత్‌లు, వక్కళిగలపై బీజేపీ కన్ను..
కర్నాటక రాష్ట్రంలో సామాజిక వర్గాల పరంగా అధిక జనాభా ఉన్న వర్గం లింగాయత్‌లు, వక్కళిగలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే ముఖ్యమంత్రులు, ఇతర మంత్రి పదవులు చేపడుతూ వచ్చారు. ఇక ప్రధానంగా కర్నాటకలో వినిపించే పేరు కెంపె గౌడ.. ఈయన వక్కళిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడుయూరప్ప లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన వారు. అయితే ఈ రెండు సామాజిక వర్గాలు బీసీ కులాల్లో ఉన్నాయి. వీరు ఎప్పటి నుంచో తమకు రిజర్వేషన్‌ శాతం పెంచాలని కోరుతున్నారు. ఈక్రమంలో ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో బొమ్మై ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై దృష్టి సారించి.. ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు మత ప్రాతిపదిన ముస్లింలకు బీసీ కింద కేటాయిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వీరికి రద్దు చేసిన రిజర్వేషన్‌ను వక్కళిగ, లింగాయత్‌ సామాజిక వర్గాలకు చెరో రెండు శాతం చొప్పున సమానంగా పంచింది. దీని ద్వారా ఆయా రెండు సామాజిక వర్గాలను సంతృప్తి పరిచి రానున్న ఎన్నికల్లో ఓట్లు పొందాలని బీజేపీ ప్లాన్‌ వేస్తోంది.

ఎన్నికల్లో ప్రభావం చూపేది వారే..
కర్నాటకలో ముస్లిం జనాభా 10 శాతం ఉంటుంది. ఈ ఓటు బ్యాంకు బీజేపీకి వచ్చే అవకాశం లేదు. ఇక ఆ రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గాలు లింగాయత్‌లు వీరు 17 శాతం మంది ఉంటారు. వక్కళిగలు వాస్తవానికి 11 శాతం మందే అయినా.. కానీ తాము 16 శాతం వరకు ఉన్నామని వారు చెబుతున్నారు. దీంతో దాదాపు 28 నుంచి 33 శాతం వరకు ఓటు బ్యాంకు బీజేపీ సొంతం చేసుకోవాలనే పథకంలో భాగంగానే వారు కోరిన మేరకు రిజర్వేషన్లను పెంచింది. ఇప్పటి వరకు లింగాయత్‌లకు 5 శాతం రిజర్వేషన్ ఉండగా.. పెరిగిన రిజర్వేషన్‌ ప్రకారం ప్రస్తుతం 7 శాతానికి చేరింది. ఇక వక్కళిగలకు గతంలో 4 శాతం రిజర్వేషన్‌ ఉండగా.. అది 6 శాతానికి పెరిగింది. అయినప్పటికీ బీజేపీకి వారు ఏ మేరకు మద్దతు ఇస్తారు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. రాష్ట్రంలో మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా.. వక్కళిగలు, లింగాయత్‌లు ప్రభావం దాదాపు 100 సీట్లలో ఉంటుంది. దీంతో వారి ఓట్లు పక్కకు పోకుండా తమవైపు మరల్చుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

హిందుత్వంపై కూడా ఫోకస్‌..
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ హిందుత్వం అనే సెంటిమెంట్‌ని బాగా ఉపయోగిస్తోంది. ఆ మేరకు హిందువుల ఓట్లను తమ పార్టీకి పడేలా చూసుకుంటోంది. దీంతోపాటు గతంలో హిజాబ్‌ వివాదం అక్కడ ఘర్షణలకు దారితీసిన పరిస్థితులు ఉన్నాయి.. ఈక్రమంలో ముస్లిం ఓటింగ్‌ పడకపోయినా.. హిందువులందరూ ఓటు వేస్తారని బీజేపీ అనుకుంటోంది. ఇక మరోవైపు గత డిసెంబర్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్సీలకు 15 శాతం నుంచి 17 శాతానికి రిజర్వేషన్‌ పెంచింది. ఎస్టీలకు గతంలో నాలుగు శాతం రిజర్వేషన్ఉండగా.. అది 7 శాతానికి పెంచింది. అయితే ఎస్సీల్లో ఉన్న కొన్ని ఉపకులాలకు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయని కింది స్థాయిలో వున్న ఉపకులాల నుంచి ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఎస్సీల్లోని 101 ఉపకులాలను నాలుగు భాగాలుగా విభజించి.. 17 శాతం రిజర్వేషన్న్రి పంచింది. ఇక ఎస్టీలకు కూడా అదేవిధానాన్ని పాటించింది. అలాగే కడు కురుబ, జేను కురుబ వంటి వర్గాల వారిని ఎస్టీ కేటగిరీలో చేర్చేందుకు సిఫార్సులను పంపుతామని సీఎం బొమ్మై తెలిపారు.

ముస్లింలకు అన్యాయం చేయలేదు – బీజేపీ 
ఓబీసీ రిజర్వేషన్లను తొలగించిన కర్నాటక ప్రభుత్వం.. తాము ముస్లింలను చిన్నచూపు చూడట్లేదని పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలందరూ ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారని దాని కింద వచ్చే 10 శాతాన్ని వారు వినియోగించుకోవచ్చని చెబుతోంది. అయితే కర్నాటకలో ఈడబ్ల్యూఎస్ కిందకి అక్కడ ఉన్న నాలుగు శాతం అగ్రవర్ణకులాలే ఇప్పటివరకు పొందుతున్నాయి. ఇకపై ముస్లింలకు 6 శాతం మేర ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ వస్తుందని బొమ్మై ప్రభుత్వం అంటోంది. మరో వైపు కాంగ్రెస్‌ మాత్రం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తొలగించడాన్ని తప్పుపడుతోంది. ఏది ఏమైనా ఎన్నికల్లో కుల సమీకరణాల ప్రభావం ఉంటుందని బలంగా నమ్ముతున్న బీజేపీ వెంట…. ఆయా సామాజిక వర్గాలు అండగా ఉంటాయో లేదో మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.