నాన్నా లవ్యూ… మనోజ్ ఎమోషనల్ పోస్ట్!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా తన పెళ్లిలో మోహన్‌బాబు మౌనికను ఆశీర్వదిస్తున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. ‘నడక నుంచి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా.. లవ్ యూ..’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మనోజ్. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు మోహన్ బాబుకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
మనోజ్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మంచు లక్ష‍్మీ ప్రసన్న స్వగృహంలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక, మనోజ్ పెళ్లి సంగతులన్నీ మంచు లక్ష్మీ సోషల్మీడియా వేదికగా ఎప్పటికప్పుడు పంచుకున్నారు. మనోజ్ సైతం పెళ్లి రోజున మౌనికా రెడ్డి ఫోటోను షేర్ చేసి పెళ్లి కబురు చెప్పారు. పెళ్లికొడుకును చేస్తున్న ఫొటో షేర్ చేసిన లక్ష్మి పోస్ట్‌కి ఎమోషనల్‌గా రిప్లయ్ ఇచ్చారు. అయితే మనోజ్, మౌనికని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదనే రూమర్స్ వినిపించాయి. కానీ ఆయన పెళ్లికి హాజరై సందడి చేయడంతో అవన్నీ కల్పితాలే అని రుజువైంది. అయితే ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరించింది మాత్రం మంచు లక్ష్మినే. తమ్ముడి పెళ్లికి అన్నీ తానే దగ్గరుండి జరిపించింది.
పెళ్లి అనంతరం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లిన మనోజ్, మౌనిక జంట.. స్వర్గీయ భూమా నాగిరెడ్డి దంపతుల మెమోరియల్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొత్త జంటకు కర్నూల్ టోల్గేట్ వద్ద అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. మనోజ్, మౌనికా రెడ్డి.. ఇద్దరికి కూడా ఇది రెండో పెళ్లి అని తెలిసిందే. 2015లో ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెతో విడిపోయాడు. ఆ తర్వాత మౌనికా రెడ్డికి దగ్గరయ్యారు. అలాగే మౌనికకు కూడా 2016లో బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డితో వివాహం జరిగింది. ఒక కొడుకు పుట్టిన తర్వాత మనస్పర్థలతో వాళ్లిద్దరూ విడిపోయారు. అయితే గతేడాది సీతాఫల్ మండిలోని వినాయక మంటపానికి మనోజ్, మౌనికా రెడ్డి కలిసి రావడంతో ఇద్దరి మధ్య రిలేషన్ గురించిన రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఎవరూ అధికారికంగా వెల్లడించలేదు. ఎట్టకేలకు మనోజ్, మౌనిక వివాహ బంధంతో ఒక్కటవడంతో అభిమానులూ సంబరపడుతున్నారు. పెళ్లి తర్వాత మనోజ్ మళ్లీ తన కేరీర్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం మనోజ్ ‘వాట్ ది ఫిష్’ చిత్రంలో నటిస్తున్నారు.