మంచు మనోజ్ వివాహం.. పెళ్లి ఆరోజేనట!
తెలుగు చిత్రసీమలో ప్రముఖ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గురించి ఆయన కుటుంబం గురించి అందరికీ సుపరిచితమే.. త్వరలో ఆయన ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి అని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. మంచు మోహన్‌బాబు, నిర్మలా దేవి కుమారుడైన మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. వీటిని సంబంధించిన కొన్ని వార్తలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్నూల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు దివంగత భూమి నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చిన్న కుమార్తె అయిన మౌనిక రెడ్డిని మంచు మనోజ్ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. అయితే మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి. అసలు వీరిద్దరికీ ఎక్కడ పరిచయం ఏర్పడింది? ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు.. అంతకుముందు మొదటి వివాహం చేసుకున్న వారితో విడిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందామా..
మంచు, భూమా కుటుంబాల బంధం ఎప్పటిదో..
దివంగత భూమా నాగిరెడ్డి రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయనకు సినిమా రంగంపై ఉన్న ఆసక్తి మేరకు.. డిస్ట్రిబూషన్ వ్యవస్థ ఉండేది. అలా రాయలసీమలో కీలక డిస్ట్రిబూటర్‌గా ఆయన ఎదిగారు. ఆ సమయంలోనే మంచు మోహన్‌బాబుతో ఆయన కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అదే ఇరు కుటుంబాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పింది. భూమా నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందులో పెద్ద కుమార్తె భూమా అఖిల్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. ఇక మరో కుమార్తె మౌనిక రెడ్డి. డిస్ట్రిబూషన్ పనులపై నిత్యం హైదరాబాద్ కు భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు వస్తుండే వారు. ఈక్రమంలో మంచు మనోజ్‌కు మౌనికకు పరిచయం ఏర్పడింది. వారి మధ్య ప్రేమ వ్యవహారం కూడా నడిచిందని.. అప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన నాగిరెడ్డి కొన్ని రాజకీయ, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో వారి పెళ్లికి అంగీకరించలేదని కొందరు చెబుతారు. అలా మనోజ్, మౌనిక వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు.
దాంపత్య జీవితం కొనసాగించకపోవడానికి కారణం ఇదే..
మంచు మనోజ్ పెళ్లి 2015లో జరిగింది. మంచు విష్ణు భార్య స్నేహితురాలైన ప్రణతి రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం తర్వాత ఇరువురి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో 2019లో విడిపోయారు. దీనికి సంబంధించిన కారణాలను కూడా మనోజ్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. ఇక మరోవైపు భూమ మౌనిక 2016లో బెంగళూరుకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వారికి ఓ బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత సంవత్సరాల్లో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కొన్నాళ్లకు భూమా నాగిరెడ్డి కూడా అనారోగ్యంతో చనిపోయారు. ఈక్రమంలో కుటుంబ ఆస్తులకు సంబంధించి భూమా కుమారుడు విద్యాధరరెడ్డికి కుమార్తె అఖిలప్రియ, మౌనికకు మధ్య వివాదాలు వచ్చాయి. ఈక్రమంలో మనోజ్ వారికి అండగా నిలిచాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలా మరోసారి ఇద్దరు దగ్గరయ్యారని.. అప్పటికే వీరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉండటంతో ఈ ప్రేమ జంట త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు సమాచారం. గత ఏడాది నుంచి వీరు ఏదోక చోట కలుసుకుంటూ వార్తల్లో నిలిచారు. అయితే ఎక్కడా పెళ్లి చేసుకుంటున్నట్లు మీడియాకు తెలియజేయలేదు. గత డిసెంబర్ నెలలో కడప దర్గాను మనోజ్ సందర్శించిన సందర్భంగా త్వరలో కొత్త జీవితం ప్రారంభించనున్నట్టు చెప్పారు.
పెళ్లి పనులు షురూ చేసిన మంచు లక్ష్మీ..
మనోజ్, మౌనికల పెళ్లి మార్చి 3వ తేదీ జరగనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు.. ముందస్తు పెళ్లి వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలు మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో మనోజ్ పెళ్లిపై అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేసింది.