‘హృదయాలు రెండు.. ఆత్మ ఒక్కటే’ మంచు లక్ష్మి ఎమోషనల్ ట్వీట్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పెళ్లి విశేషాలు నెట్టింట సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఎట్టకేలకు శుక్రవారం రాత్రి మంచు మనోజ్, మౌనికా రెడ్డి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక, మనోజ్ పెళ్లి సంగతులన్నీ మంచు లక్ష్మీ సోషల్మీడియా వేదికగా ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. మనోజ్ సైతం పెళ్లి రోజున మౌనికా రెడ్డి ఫోటోను షేర్ చేసి పెళ్లి కబురు చెప్పారు. పెళ్లికొడుకును చేస్తున్న ఫొటో షేర్ చేసిన లక్ష్మి పోస్ట్‌కి ఎమోషనల్‌గా రిప్లయ్ ఇచ్చారు. తాజాగా మంచు లక్ష్మి కొత్త జంటపై చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
కొత్త జంట ఫొటోతో పాటు మరిన్ని ఫొటోలు షేర్ చేసిన మంచు లక్ష్మి ‘హృదయాలు రెండు, ఆత్మ ఒక్కటే.. ఈ బంధం కలకాలం నిలిచిపోతుంది’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ పోస్టు చూసిన ఫ్యాన్స్.. బ్యూటిఫుల్ కపుల్, కంగ్రాట్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే మనోజ్, మౌనికని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదనే రూమర్స్ వినిపించాయి. కానీ ఆయన పెళ్లికి హాజరై సందడి చేయడంతో అవన్నీ కల్పితాలే అని రుజువైంది. అయితే ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరించింది మాత్రం మంచు లక్ష్మినే. తమ్ముడి పెళ్లికి అన్నీ తానే దగ్గరుండి జరిపించింది.
పెళ్లి అనంతరం హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లిన మనోజ్, మౌనిక జంట.. స్వర్గీయ భూమా నాగిరెడ్డి దంపతుల మెమోరియల్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొత్త జంటకు కర్నూల్ టోల్గేట్ వద్ద అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. మనోజ్, మౌనికా రెడ్డి.. ఇద్దరికి కూడా ఇది రెండో పెళ్లి అని తెలిసిందే. 2015లో ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెతో విడిపోయాడు. ఆ తర్వాత మౌనికా రెడ్డికి దగ్గరయ్యారు. అలాగే మౌనికకు కూడా 2016లో బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డితో వివాహం జరిగింది. ఒక కొడుకు పుట్టిన తర్వాత మనస్పర్థలతో వాళ్లిద్దరూ విడిపోయారు. అయితే గతేడాది సీతాఫల్ మండిలోని వినాయక మంటపానికి మనోజ్, మౌనికా రెడ్డి కలిసి రావడంతో ఇద్దరి మధ్య రిలేషన్ గురించిన రూమర్స్ మొదలయ్యాయి. కానీ ఎవరూ అధికారికంగా వెల్లడించలేదు. ఎట్టకేలకు మనోజ్, మౌనిక శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటవడంతో అభిమానులూ సంబరపడుతున్నారు.