కొత్త వధువు కొంపముంచిన బెంగళూరు ట్రాఫిక్
కర్ణాటక రాజధాని బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడి ఐటీ కంపెనీల్లో పనిచేసేవారికి రోజూ ఆ ట్రాఫిక్‌లో ఆఫీస్‌లకు వెళ్లడం అంటే నరకంతో సమానమనే చెప్పాలి. 10 గంటలకు ఆఫీస్ అంటే ఇంట్లో నుంచి 7కి బయలుదేరాల్సిన పరిస్థితి. ఈ ట్రాఫిక్ వల్ల కొందరు ఉద్యోగులు సమయానికి ఆఫీస్‌కి వెళ్లలేక ఇన్ పంచ్ లేట్ అవడంతో అరపూట వర్క్ చేసి సగం జీతమే తీసుకోవాల్సిన పరిస్ధితులు కూడా ఉన్నాయి.
ఇవన్నీ అటుంచితే.. ఈ బెంగళూరు ట్రాఫిక్ కొత్తగా పెళ్లైన వధువుకి శాపంగా మారింది. అసలేం జరిగిందంటే.. చిక్కబళ్లాపూర్కు చెందిన ఓ వ్యక్తికి.. ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. ఫిబ్రవరి 16న భార్యతో కలిసి చర్చికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా.. పై లేఅవుట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 10 నిమిషాల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. దాంతో ఆ వ్యక్తి కారు డోర్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. అసలు ఏం జరుగుతుందో భార్యకు తెలిసేలోపే అతను ఆ ట్రాఫిక్‌లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఆ మహిళ తన భర్త కోసం ఎంత వెతికినా కనిపించలేదు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
మార్చి 5న ఆ మహిళకు గోవా నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మరో యువతి గోవా నుంచి ఫోన్ చేసి బెదిరిస్తోందని పోలీసులకు చెప్పింది. అయితే ఆ యువతి ఎవరో కాదని.. తన భర్త మాజీ లవర్ అని తెలిసి షాకైంది. ట్రాఫిక్‌లో కారు దిగి పారిపోయిన ఆ వ్యక్తి గోవాలో తన ప్రేయసి వద్దకు చేరుకున్నాడట. అయితే తన భర్తకు ప్రేయసి ఉందన్న సంగతి తనకు ముందే తెలుసని, ఆమెకు బ్రేకప్ చెప్పిన తర్వాతే తాను నమ్మి పెళ్లిచేసుకున్నానని తెలిపింది. అయితే తన భర్తను బ్లాక్మెయిల్ చేసి గోవా రప్పించుకుందని, ఆమె వల్ల తన భర్త మానసికంగా కుంగిపోతున్నాడని ఎలాగైనా తన భర్తను తన వద్దకు సేఫ్‌గా తీసుకురావాలని పోలీసులను కోరింది. ఈ మేరకు కర్ణాటక పోలీసులు గోవా పోలీసులతో చర్చలు జరిపి ఆ వ్యక్తిని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.