మంచు మనోజ్ పెళ్లి.. విష్ణు అలా వెళ్లిపోయాడేంటి?
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ మొత్తానికి మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె అయిన భూమా మౌనిక రెడ్డితో మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఫిలిం నగర్‌లోని తన సోదరి మంచు లక్ష్మీప్రసన్న నివాసంలో ఈ వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎక్కువ మంది సెలబ్రిటీలను పిలకుండా చాలా సింపుల్‌గా ప్రైవేట్‌గా కార్యక్రమాన్ని జరిపించారు.
ఇకపోతే ఇప్పుడు చర్చ అంతా మనోజ్ పెళ్లికి తన అన్న అయిన మంచు విష్ణు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లిపోవడమే. అన్నదమ్ముల మధ్య ముందు నుంచీ ఏవైనా మనస్పర్ధలు ఉన్నాయా? లేకపోతే తన సోదరుడు మౌనిక రెడ్డిని చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదో తెలీదు కానీ దగ్గరుండి అన్నీ చూసుకుని సందడి చేయాల్సిన విష్ణు.. ఏదో సెలబ్రిటీలాగా వివాహానికి ఆహ్వానించారు కాబట్టి వెళ్లి వచ్చేద్దాం అన్నట్లు తన భార్య విరానికా రెడ్డి, పిల్లలతో కలిసి వధూవరులను ఆశీర్వదించి వెళ్లిపోయారు. అంతేకాదు.. ఫ్యామిలీ ఫొటోల్లో కూడా విష్ణు కనిపించకపోవడం చర్చలకు దారి తీస్తోంది. ఈ పెళ్లి జరగడం మోహన్ బాబుకి కూడా ఇష్టం లేదని వార్తలు వచ్చాయి కానీ..ఆయన తన కోడలు మౌనిక రెడ్డిని పలకరించిన తీరు చూస్తే అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
ఇకపోతే మనోజ్‌కి, మౌనికకు ఇది రెండో వివాహం. గతంలో మౌనికకు బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేశ్ రెడ్డితో వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి ధైరవ్ రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అప్పుడప్పుడు మౌనిక తన కుమారుడితో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. ఇక మనోజ్‌కి 2015లో ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి 2019లో విడిపోయారు. మౌనిక తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మనోజ్ ఆమెకు అండగా నిలిచారని, అప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఏదేమైనా మనోజ్, మౌనిక సుఖ సంతోషాలతో నిండునూరేళ్లు చల్లగా ఉండాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.