TSPSC పరీక్ష పేప‌ర్లు లీక్‌ .. వెలుగులోకి సంచలన విషయాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 5వ తేదీన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష జరిగింది. అయితే.. ఏఈ పరీక్ష పేపర్‌ను టీఎస్‌పీఎస్సీలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్‌కుమార్‌తోపాటు, సిస్టం అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డి, మరో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ కలిసి ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసినట్లు తేలింది. దీనిలో ప్రధాన నిందితుడు.. ప్రవీణ్‌ అని తేలడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. టీఎస్పీఎస్సీని బీజేవైఎంచ ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఇవాళ ముట్టడించేందుకు యత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున బీజేవైఎం నాయకులు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వచ్చి, అక్కడ ఉన్న ధాన బోర్డును విరగొట్టారు. దీంతో పలువురు బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

తవ్వేకొద్ది కొత్త విషయాలు వెలుగులోకి..
ఇక ఏఈ పరీక్ష పేపర్‌ లీకేజి విషయంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రవీణ్‌ పోలీసుల విచారణలో ఉన్నారు. గతేడాది అక్టోబర్‌ 16న జరిగిన గ్రూప్‌ – 1 ప్రిలిమ్స్‌ పరీక్షను ప్రవీణ్‌ రాశారు. అతను కూడా ఈ పరీక్ష రాయడంతో.. ప్రిలిమ్స్‌ పేపర్‌ కూడా లీకైందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే.. జనవరి 13న విడుదలైన ప్రిలిమ్స్ ఫలితాల్లో అతను క్వాలిఫై కాలేదు. కానీ.. 150 మార్కులకు గాను.. ప్రవీణ్‌ 103 మార్కులు సాధించారు. అసలు ఇతనిలో ఇంత టాలెంట్‌ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రవీణ్ రాసిన ప్రిలిమ్స్ పరీక్ష పేపర్‌ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రవీణ్‌ కీలకంగా మారాడు. మహిళలతో వ్యవహారాలు నడుపుతూ అడ్డగోలు దందా చేస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్ ఫోన్‌లో విచ్చలవిడిగా పోర్న్‌ చిత్రాలు, అసభ్య చాటింగ్‌లను ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ ఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించారు. మరోవైపు గ్రూప్‌-1 పరీక్ష పత్రాలు లీకై ఉండొచ్చని వస్తున్న వార్తలపై పలువురు అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇటీవలే ప్రభుత్వం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను వెల్లడించింది. అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో అసలు ఏం జరుగుతుందో వీరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో టీఎస్‌పీఎస్సీ..
ఏఈ పరీక్షతోపాటు, ఈ నెల 5న నిర్వహించిన పరీక్షలను రద్దు చేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం కమిషన్‌ అత్యవసరంగా సమావేశమై చైర్మన్‌ జనార్దన్‌రెడ్డితోపాటు సభ్యులు చర్చించి, ఓ ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. మరోవైపు పేపరు లీకేజీ వ్యవహారం కారణంగా ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ మార్చి 12న జరగాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ (టీపీబీవో), మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్టు కమిషన్‌ ప్రకటించింది. అభ్యర్థులకు ఇప్పటికే ఈ సమాచారాన్ని చేరవేసింది. ఈ పరీక్షల నిర్వహణ తేదీలను కూడా ఇవాళ కమిషన్‌ ప్రకటించే అవకాశం ఉంది.