“కేటీఆర్‌ను బ‌ర్త‌ర‌ఫ్‌ చేయాల్సిందే”

గ్రూప్-1 పరీక్షల్లో రోజుకో వాస్తవం వెలుగులోకి వస్తోంది. బీఆర్ఎస్ నాయకుల పిల్లలు, బంధువులు, వారివద్ద పనిచేసే వాళ్లు గ్రూప్-1 పరీక్షల్లో క్వాలిఫై అయినట్లు తమకు సమాచారం అందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారని.. ఒక చిన్న గ్రామంలో ఆరుగురు క్వాలిఫై అయ్యారన్నారు. వీరంతా బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లేనన్నారు. అందులో నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతోపాటు ఒక జడ్పీటీసీ వద్ద బాడీగార్డ్ గా పనిచేసే వ్యక్తి కొడుకు క్వాలిఫై అయ్యారన్నారు. మరోచోట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై అయ్యారని .. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హత అయ్యే అవకాశమే లేనప్పటికీ… క్వాలిఫై చేశారన్నారు. కేసీఆర్ కొడుకు సహకారంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆయన సన్నిహిత వ్యక్తే ఇదంతా చేశారన్నారు. ఒక్కొక్కరి దగ్గర 3 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం తమ దగ్గర ఉందన్నారు. తక్షణమే కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని బండి ఆరోపించారు. సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఆయన నియమించిన సిట్ తో విచారణ ఎలా సాధ్యం? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్ కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని బండి ఆరోపించారు.

రేవంత్‌ రెడ్డి ఏమన్నారంటే..
పేపర్ల లీకేజీ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. కేటీఆర్‌ పీఏ ప్రోద్భలంతో పేపర్ల లీకేజీ అంతా జరిగిందని ఆరోపించారు. దీంతోపాటు బీఆర్‌ఎస్‌ నేతలు కుమారులు, బంధువుల పిల్లలు గ్రూప్‌ -1 పరీక్షల్లో పెద్ద ఎత్తున మార్కులు తెచ్చుకున్నారని రేవంత్‌ తెలిపారు. దీంతో సిట్‌ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. స

రేవంత్‌, బండికి సిట్ నోటీసులు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీకేజీపై ఆరోపణలు చేస్తున్న వారందరికీ సిట్ నోటీసులు ఇస్తోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సహా మరికొందరికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మల్యాల మండలంలో 100 మందికిపైగా గ్రూప్-1లో మంచి ర్యాంకులు వచ్చాయని రేవంత్ ఆరోపించిన విషయం తెలిసిందే. బండి సంజయ్‌ కూడా కేటీఆర్‌ పాత్ర ఉందని ప్రస్తావించారు. దీంతో వీరిద్దరికీ సిట్‌ నోటీసులు జారీ చేసింది. మీ వద్ద ఉన్న వివరాలు సమగ్రంగా ఇవ్వాలని అందులో పేర్కొంది.