Raghavendra Rao: ‘సర్కారు నౌకరి’తో రానున్న దర్శకేంద్రుడు!

Hyderabad: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు(K. Raghavendra Rao) ఈ రోజు తన 81వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 100కు పైగా సినిమాలను రూపొందించిన ఆయన యాభై ఏళ్లకు పైగా చిత్రపరిశ్రమకు సేవలందిస్తున్నారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్​, నిర్మాతగానూ సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ప్రస్తుతం కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. దర్శకుడిగా మారాలని కలలు కంటూ తగిన శిక్షణ తీసుకునే స్థోమత లేని వారికోసం యూట్యూబ్​లో ‘కే.ఆర్​.ఆర్. క్లాస్​రూమ్స్’ పేరున 32 ఎపిసోడ్ల కార్యక్రమం చేశారు. దీనిలో సినిమాలోని ఒక్కో షాట్​ ఎలా చిత్రీకరిస్తారో వివరించారు. షార్ట్​ ఫిలిమ్స్​ తీసే వాళ్లను ప్రోత్సహించడానికి ‘కే.ఆర్​.ఆర్​. వర్క్స్​’ పేరున ఓ సంస్థ స్థాపించారు. దీని ద్వారా నూతన దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికి ఈ సంస్థలో 15 షార్ట్​ ఫిలిమ్స్​ నిర్మించారు.

ప్రస్తుతం రాఘవేంద్ర రావు పంచతంత్ర కథలు సినిమా దర్శకుడు శేఖర్‌ గంగమనేనితో ‘సర్కార్‌ నౌకరీ’(Sarkaru Noukari) అనే సినిమాని ఆర్‌కే టెలీ షో పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తున్నారు. ఓ మారుమూల పల్లెటూళ్లో జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. జూన్​ చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకేంద్రుడి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్​ పోస్టర్​తో శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. సోషల్​ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు దర్శకేంద్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.