ఏపీ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్.. స్టార్ క్యాంపెయినర్​గా కేటీఆర్!

దేశరాజకీయాల్లో చక్రం తిప్పేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి చర్చలు కూడా చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ కు మంత్రి కేటీఆర్ను స్టార్ క్యాంపెయినర్గా ఎంచుకున్నట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో పట్టుసాధించేందుకు వ్యూహాలు పన్నుతున్న కేసీఆర్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సదస్సుల్లో వివిధ రంగాల్లో తెలంగాణా సాధించిన ప్రగతిని ఏపీలోని జనాలకు ముఖ్యంగా యూత్ కు వివరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేటీఆర్ కు స్టార్ క్యాంపెయినర్ హోదాను ఇచ్చి కేసీఆర్ కూడా వెంటే ఉండి పర్యటనలు చేయించాలని డిసైడ్ అయ్యారట.
దేశవ్యాప్తంగా పర్యటనలు..
ఇప్పటికే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ గొంతును ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వినిపిస్తున్నారు. ఢిల్లీ, మహారాష్ట్రాల్లో రెండుసార్లు పర్యటించి సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతోందంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తొందరలోనే ఏపీలో పర్యటించేందుకు కూడా రెడీ అవుతున్నరాట. రానున్న రెండు నెలల్లో కేటీఆర్ తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. పై ఆరు జిల్లాల్లో తమ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని కేసీఆర్ అంచనా వేస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్ కున్న బలమైన అవకాశం ఏపీలోని చాలా ప్రాంతాల్లోని యువత హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తుండటం, ఏదో కోర్సు చేస్తుండటమే. హైదరాబాద్లోని ఏపీ సెట్లర్స్ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.
బ్రాండ్ అంబాసిడర్లు..
యువతను బీఆర్ఎస్ కు అప్రకటిత బ్రాండ్ అంబాసిడర్లుగా ఉపయోగించుకునే ఆలోచన కూడా చేస్తున్నారట. హైదరాబాద్ లో ఉద్యోగాలకు, ఉన్నత కోర్సులు చేయటానికి ఉన్న అవకాశాలను యువత ఎలాగూ తమ ప్రాంతాల్లో చెబుతునే ఉంటారు. కాబట్టి అలాంటి యువతను గుర్తించి వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రచారం చేయించుకునే వ్యూహం బాగా పనికొస్తుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.
టార్గెట్ దిశగా..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లను గెలుచుకోవటమే టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నారట కేసీఆర్. అందుకనే నియోజకవర్గాల వారీగా సామాజికవర్గాల జనాభాను, అందులో బలమైన నేతలను గుర్తించే పనిని కేసీయార్ కొందరు నేతలకు ఇప్పటికే అప్పగించారట. వివిధ కులసంఘాల్లో పట్టున్న నేతలతో పాటు ఇతర పార్టీల్లోని బలమైన నేతలను, టికెట్ల దక్కవని అనుమానం ఉన్న సిట్టింగులు లేదా సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఈ బాధ్యత ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు అప్పగించారని తెలుస్తోంది. కేసీఆర్ వ్యూహం ఫలించి అనుకున్న సీట్లలో విజయం సాధిస్తే ఏపీలోనూ బీఆర్ఎస్ బలపడడం ఖాయం.