BRS శ్రేణులతో కేసీఆర్‌ కీలక మంతనాలు

ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శ్రేణులను సమాయత్తం చేసేందుకు అటు మంత్రి వర్గంతోపాటు, పార్టీ నాయకులతో రెండ్రోజులపాటు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాల తీరు తదితర అంశాలపై ఆయన విస్తృతంగా చర్చించనున్నారు.

నేడు మంత్రి వర్గంతో చర్చలు..
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గురువారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాల పంపిణీపై ప్రధానంగా కేసీఆర్‌ చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే.. వారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఈక్రమంలో దీనిపై కూడా మంత్రి వర్గంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై కేబినెట్‌ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఇప్పటికే ఇళ్ల స్థలాలపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకాగా.. ఇళ్ల స్థలాలు, వాటి క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీ అందించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అవకాశం ఉన్నచోట పట్టాల పంపిణీ కోసం అనువైన స్థలాలు, వాటి వివరాలను మంత్రివర్గ ఉప సంఘం గుర్తించింది. దీంతో పట్టాల పంపిణీపై మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకోనుంది. వీటితోపాటు ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడం, నిధుల సమీకరణపై కూడా చర్చించే అవకాశం ఉంది.

కవిత ఇష్యూపై కూడా చర్చ..
ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన ఎమ్మెల్సీ కవిత అంశంపై కూడా సీఎం కేసీఆర్‌ మంత్రి వర్గంతో చర్చించే అవకాశం ఉంది. ఈడీ నోటీసుల అంశం.. తదుపరి జరిగే చర్యలపై వారితో కేసీఆర్‌ మాట్లాడనున్నారు. బీజేసీ చేసే కుట్రలను ఏవిధంగా ఎదుర్కోవాలి… వాటిని ఏవిధంగా తిప్పికొట్టాలి అన్న విషయాలపై మీటింగ్‌లో సమాలోచన చేయనున్నారు. దీంతోపాటు ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను కూడా సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయాల్సిన ఇద్దరి పేర్లను కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు.

నాయకులతో రేపు భేటీ..
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు.. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన యాత్రల గురించి.. వాటికి వస్తున్న స్పందనపై ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్‌ నాయకులతో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ లు, తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం.