ED అధికారికి కవిత సంచలన లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత మూడో విడత విచారణ కోసం ఇవాళ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అయితే నిన్న జరిగిన విచారణలో ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారని కవితను ఈడీ విచారణ అధికారి జోగేంధర్‌ ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఆమె.. ఫోన్లు ధ్వంసం చేశానని చెప్పడం నిరాధార ఆరోపణ అని పేర్కొన్నారు. ఈ ఆరోపణ చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తాను గతంలో వాడిన ఫోన్లను ఈడీ అధికారులకు ఇవాళ సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక మహిళ ఫోన్ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా… అంటూ ఈడీ అధికారికి కవిత లేఖ రాశారు. పక్షపాతి వైఖరితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ.. ఫోన్లను ధ్వంసం చేశానని పేర్కొందనని.. కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఇలాంటి ఆరోపణలు చేశారో అర్థం కావట్లేదని కవిత తెలిపారు. తనను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచిందని.. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనన్నారు. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు… తనను ప్రజల్లో నిందిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువును పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమన్నారు.

ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు..
ఈడీ విచారణ కోసం కవిత ఉదయం 11 గంటల ప్రాంతంలో వెళ్లారు. ఈక్రమంలో తనతోపాటు పాత సెల్‌ఫోన్లను సైతం ఓ కవరులో తీసుకుని వచ్చారు. వాటిని మీడియాకు చూపించారు. ఈక్రమంలో ఆమె భర్త అనిల్‌ కూడా అక్కడే ఉన్నారు. అనంతరం కవిత విచారణకు వెళ్లారు. అయితే… ఇవాళ ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో కవితను అరెస్టు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్థాయి భద్రత దేనికి సంకేతం అన్న అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కవితను అరెస్ట్ చేస్తారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు లిక్కర్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు.