విచారణకు రాలేనన్న కవిత.. రావాలంటున్న ఈడీ.. ఢిల్లీలో ఉత్కంఠ!
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యం కారణంగా ఇవాళ్టి విచారణకు హాజరుకాలేనని ఈడీకి తెలియజేశారు. ఇప్పటికే ఆమె ఈడీపై పలు ఆరోపణలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కోర్టు ఆమె వాదనలను తోసి పుచ్చింది. ఈక్రమంలో గురువారం ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సి ఉండగా.. తనకు అనారోగ్యం బాలేదని నేటి విచారణకు రాలేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ మేరకు తన సందేశాన్ని తన తరపు లాయర్ సోమా భరత్ ద్వారా ఈడీకి అందజేస్తున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత ఈడీ ఏవిధమైన చర్యలు తీసుకుంటుంది అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరో తేదీన తాను విచారణకు హాజరవుతానని కవిత చెబుతున్నట్లు ఈడీకి సందేశం పంపుతున్నట్లు సమాచారం. అయితే తప్పనిసరిగా ఇవాళ విచారణకు కవిత రావాల్సిందేనని ఈడీ చెబుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలియవస్తోంది.
న్యాయపోరాటం చేసే ఆలోచనలో కవిత..
ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీ విచారణ చేసిన తీరుపై పిటిషన్ దాఖలు చేశారు. మహిళను ఇంటి వద్దే విచారించాలని అందులో కవిత కోరారు. దీంతోపాటు ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న చందన్‌రెడ్డిని దారుణంగా కొట్టారని, దాంతో ఆయన వినికిడి శక్తి కోల్పోయారని పేర్కొన్నారు. దీనిపై చందన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని, ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని వివరించారు. తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా సాక్షులను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని, కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామంటూ భయపెడుతున్నారని తన పిటిషన్‌లో కవిత తెలియజేశారు. అయితే దీనిపై స్పందించిన కోర్టు.. కవిత పిటిషన్‌ను ఈనెల 24వ తేదీన విచారిస్తామని సుప్రీం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈక్రమంలో కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా… అనారోగ్యం కారణంగా రాలేనని ఆమె ఈడీకి మెయిల్ ద్వారా తెలియజేసింది. అసలు ఈడీ ఏం చేయబోతుందోనని తెలియని పరిస్థితి. కవితను ఈడీ అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఈడీ ఇవాళే ఎందుకు విచారించాలనుకుంది..
కవిత ఇవాల్టి ఈడీ విచారణకు వస్తే.. అరుణ్ పిళ్లైతో కలిపి ఆమెను ప్రశ్నించాలని ఈడీ భావించింది. దీంతోపాటు బుచ్చిబాబును కూడా ఇవాళ విచారించనుంది. దీంతో ముగ్గురినీ విచారించాలనుకున్న ఈడీకి కవిత షాక్ ఇచ్చారు. తాను ఇవాళ హాజరు కాలేనని చెప్పారు. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.
ఢిల్లీలోనే బీఆర్‌ఎస్ పెద్దలు, మంత్రులు..
తెలంగాణ రాజకీయాలకు దేశ రాజధాని ఢిల్లీలో వేడెక్కాయి. కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరు కానుండటంతో ఢిల్లీలోనే ఆమెకు మద్దతుగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇప్పటికే మకాం వేశారు. మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు కూడా గత కొన్ని రోజులుగా అక్కడే ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు పరిణామాలు గమనిస్తున్నారు.