ఆస్కార్ కోసం 80 కోట్లు.. కార్తికేయ క్లారిటీ!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై మెరిసింది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దేశవిదేశాల్లో విడుదలై రికార్డు కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సాధించి చరిత్ర సృష్టించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌లో ఆస్కార్ సాధించగా.. ఇందుకోసం రాజమౌళి పెట్టిన ఖర్చుపై రకరకాల వార్తలు హల్చల్ చేశాయి. ఇక, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్‌తో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే ఆస్కార్ విజయం వెనకాల రాజమౌళి తనయుడు కార్తికేయ కృషి ఎంతగానో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కార్తికేయ ఆస్కార్ కోసం పెట్టిన ఖర్చుపై క్లారిటీ ఇచ్చారు.
పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించగా, బాలీవుడ్ భామ ఆలియా భట్, హాలీవుడ్ తార ఓలీవియా వారికి జోడీగా నటించారు.
ఆస్కార్ కంటే ముందే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు పాట ఇంకొన్ని అవార్డులు కూడా సాధించింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డు సాధించడం ద్వారా కుంభస్థలాన్ని కొట్టేసింది. ఆస్కార్ అవార్డు తీసుకుంటూ కీరవాణి..కార్తికేయకు ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకు చెప్పాడనేది ఆసక్తిగా మారింది. కార్తికేయ ఎవరో కాదు. దర్శకుడు రాజమౌళి కుమారుడు. కార్తికేయ ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడని ఎన్టీఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా భారతదేశం నుంచి అధికారికంగా ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కాలేదు. ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌కు ఎంపిక చేయలేదు. దాంతో ఆర్ఆర్ఆర్ టీమ్ నిరాశకు లోనైంది.
దాంతో కార్తికేయ రంగంలో దిగాడు. దేశం నుంచి ఎంపిక కానప్పుడు సొంతంగా ఫారిన్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది. కార్తికేయ ఆర్ఆర్ఆర్ సినిమాను ఫారిన్ ఎంట్రీలో ఆస్కార్ నామినేషన్‌కు పంపించాడు. అంతేకాదు..బెస్ట్ ఒరిజినల్ కేటగరీలో నాటు నాటు పాటను ప్రత్యేకంగా పంపించాడు. పంపించి వదిలి వేయకుండా..ఆర్ఆర్ఆర్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నాడు.
అమెరికాలో అత్యధికులకు ఈ సినిమా చేరేలా మార్కెటింగ్ స్ట్రాటెజీలు అవలంభించాడు. ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కేలా చేశాడు. ఈ అవార్డు ఆధారంగా క్యాంపెయినింగ్ మరింత ముమ్మరం చేశాడు. ఆస్కార్ తుది నామినేషన్స్‌కు వెళ్లడం ఆ తరువాత మిగిలిన పాటల్ని వెనక్కి నెట్టి అవార్డు సాధించేవరకూ చాలా కృషి చేశాడు కార్తికేయ.
అయితే ఆస్కార్ కోసం రాజమౌళి స్వయంగా ఎనభై కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని వార్తలు వినిపించాయి. డి.వి.వి. దానయ్య ఈ విషయంలో సుముఖంగా లేకపోవడంతోనే ఆయన ప్రమోషన్స్‌లో కనిపించలేదనీ, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఆర్ఆర్ఆర్ టీమ్‌కి సపోర్ట్ చేశారని రకరకాల వార్తలు వచ్చాయి. కాగా, ఈ వార్తలపై తాజాగా కార్తికేయ ఓ క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకున్నట్లుగా ఆస్కార్ కోసం తాము పెట్టిన ఖర్చు ఇరవై అయిదు వేల డాలర్లు కాదనీ, ఆస్కార్ ఎంట్రీకి కీరవాణి, చంద్రబోస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్‌తో పాటు మొత్తం కుటుంబానికి ఒక్కొక్కరికీ ఏడు వందల నుంచి పదిహేను వందల డాలర్ల వరకు ఖర్చయ్యిందని చెప్పుకొచ్చారు. ఏరకంగా చూసినా ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో కార్తికేయ కీలకపాత్ర పోషించాడు. అందుకే కీరవాణి ఆస్కార్ వేదికపై కార్తికేయకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.