సూప‌ర్ ల‌వ్ స్టోరీ.. జైల్లోని ప్రియుడి కోసం ఏం చేసిందంటే!

ప్రేమించిన వ్యక్తిని పెద్దలు అంగీకరించలేదని, కులాలు వేరని, లేదా ఆ అబ్బాయి అనుమానిస్తున్నాడనో, కోప్పడుతున్నాడనో.. నీకు నాకు సెట్‌ అయ్యేలా లేదు అనుకుంటూ.. ఎంతో మంది లవర్స్‌ దూరమవుతుంటారు. కానీ కొందరు అమ్మాయిలు మాత్రం ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని పట్టుబడతారు.. అందుకోసం ఎక్కడి వరకు వెళ్లడానికైనా సిద్దపడతారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉండి శిక్ష అనుభవిస్తున్న అబ్బాయిని.. ఓ యువతి ఎప్పటి నుంచో ప్రేమిస్తూ వస్తోంది. ఈక్రమంలో ఆమెకు పెళ్లి సంబంధాలు వస్తుండటంతో.. ప్రేమించిన వ్యక్తిని తప్ప మరొకరని వివాహం చేసుకోనని తల్లిదండ్రులకు తెగేసి చెప్పేసింది. దీంతో చేసేదేమీ లేక.. జైలులో ఉన్న అతనికి బెయిల్‌ ఇప్పంచాలని అమ్మాయి, ఆమె తల్లి కలిసి పిటిషన్‌ వేసిన సంఘటన వైరల్‌గా మారింది.. మరి కోర్టు ఏం చెప్పింది. ఇంతకీ వారు ఎవరు? పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే విషయాలు తెలుసుకుందామా మరి..

కర్నాటకకు చెందిన ఆనంద్‌ అనే వ్యక్తి.. నీతా  అనే యువతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. సరిగ్గా ఆరేళ్ల కిందట.. ఓ హత్య కేసులో ఆనంద్‌ నిందితుడిగా తేలడంతో అతనికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ప్రస్తుతం అతను బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అను భవిస్తున్నాడు. ఈక్రమంలో నీతాజీకి వేరే పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటుండగా.. తాను మరొకరిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది ఆమె. ఆనంద్ తల్లి రత్నమ్మ తో కలిసి ఆనంద్‌కు పెరోల్(తాత్కాలిక బెయిల్‌) ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. తొమ్మిదేళ్లుగా ఆనంద్, తాను లవ్ చేసుకుంటున్నట్లు పిటిషన్లో నీతాజీ పేర్కొంది. మర్డర్ కేసులో అతనికి జీవిత ఖైదు పడిందని, దాన్ని పదేళ్లకు తగ్గించారని గుర్తుచేసింది. శిక్షాకాలంలో ఇప్పటికే ఆరేళ్లు పూర్తయ్యాయని ఆమె కోర్టుకు తెలిపింది. తనకు వేరొకరితో వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు నీతాజీ ఆవేదన వ్యక్తం చేసింది. మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆనంద్ ను కాదని వేరొకరిని పెళ్లి చేసుకోలేనని కోర్టుకు తన బాధను చెప్పుకుంది.

పెళ్లికి అనుమతిచ్చిన కోర్టు..
నీతాజీ పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు న్యాయవాదులు.. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆనంద్‌కు వెంటనే పెరోల్(తాత్కాలిక బెయిల్‌) మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ పై కర్నాటక హైకోర్టు మంగళవారం విచారణ జరపగా.. పిటిషనర్ అప్పీలును పరిగణనలోకి తీసుకున్న కోర్టు, జైలు నిబంధనలలోని సెక్షన్ 636లోని సబ్ సెక్షన్ 12 ప్రకారం పిటిషన్ ను అసాధారణ పరిస్థితిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఆ యువతి ప్రేమించిన  ఆనంద్‌తో పెళ్లి చేసుకోవడానికి గాను.. ఈ నెల 5 నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు అతనికి పెరోల్‌పై రిలీజ్ చేయాలని జైలు అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 15 రోజులపాటు పెరోల్‌పై ఆనంద్‌ విడుదలవుతుండటంతో.. నీతాజీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.