karnataka election: నేడే పోలింగ్… ఉదయం 7 గంటల నుంచే ఓటు వేయవచ్చు!
bengaluru: కర్నాటకలో బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్(polls) ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ(bjp) మరోసారి గెలిచి.. అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా.. దక్షిణాది రాష్ట్రంలో సత్తా చాటి జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్టను పెంచుకోవాలని కాంగ్రెస్(congress) చూస్తోంది. ఇక ఎప్పటిలాగే.. ‘హంగ్’ అసెంబ్లీపై జేడీఎస్(jds) మరోసారి గంపెడాశలు పెట్టుకుంది. ఇక బుధవారం ఓటర్లు తన తీర్పును ఈవీఎంల్లో నిక్షిప్తం చేయనున్నారు. కర్ణాటకలో 224 స్థానాలకు గానూ 2615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 5,31,33,054 (5.31 కోట్ల మంది) ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,67,28,053 (2.67 కోట్లు) మంది పురుషులు కాగా.. 2,64,00,074 (2.64 కోట్లు ) మంది స్త్రీలు ఉన్నారు. ఓటింగ్ కోసం 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.
ముఖ్యనాయకులు ఇక్కడి నుంచే బరిలో..
కర్నాటక సీఎం బవసరాజ్ బొమ్మై షిగ్గాన్ స్థానం నుంచి, వరుణ నుంచి మాజీ సీఎం సిద్ధ రామయ్య, చెన్నపట్న స్థానం నుంచి కుమారస్వామి, కనకపుర నుంచి డీకే శివకుమార్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానాల్లో గెలుపొందడంపై నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగించారు.
గడిచిన 38 ఏళ్లుగా కర్ణాటకలో ఏ ఒక్క పార్టీ వరుసగా రెండోసారి కర్నాటకలో అధికారంలోకి రాలేదు. ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇక మరోవైపు గతంలో జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ.. అధికారంలో ఎక్కువ కాలం నిలవలేకపోయింది. కాబట్టి ఈ సారి ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్ దాటాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ఇక 2018 ఎన్నికల్లో 72.36 శాతం ఓటింగ్ నమోదైంది. వారానికి మధ్యలో ఈ సారి బుధవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటింగ్ ఎక్కువే నమోదు కావొచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది.