Karate Kalyani: న్యాయపోరాటం చేస్తా!
Hyderabad: ఖమ్మంలో 54 అడుగుల శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్(NTR) విగ్రహ ఆవిష్కరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న సినీ నటి కరాటే కల్యాణి(Karate Kalyani)ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA Association) నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి తాను వ్యతిరేకం కాదని, అయితే భగవంతుడైన శ్రీకృష్ణుడి రూపంలో వద్దంటూ కల్యాణి గత కొద్ది రోజులుగా పోరాడుతోంది. అయితే, దీనిపై సీరియస్ అయిన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్‌నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. కల్యాణి ఇచ్చిన వివరణపై మా కార్యవర్గం సంతృప్తి చెందలేదని, ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో ‘మా’ నిబంధనల మేరకు కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు ‘మా’ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ రఘు బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, దీనిపై కల్యాణి స్పందించింది. ‘ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడినందుకే నన్ను ‘మా’ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చాను. నేను వేసిన పిటిషన్‌కు ‘మా’ అసోసియేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. సస్పెండ్ చేయడంపై న్యాయపోరాటం చేస్తా. నేనూ ఎన్టీఆర్‌కి వీరాభిమానిని. అయితే శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహం పెట్టడాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను’ అంటూ వివరణ ఇచ్చింది కల్యాణి. శ్రీకృష్ణుడిపై అభిమానంతోనే పిటీషన్ వేశానని, తనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలిపింది.