‘నాటు నాటు’కి ప్రపంచమంతా ఆడుతోంది: ఉపేంద్ర‌

ఆస్కార్​ నామినేషన్స్​ మొదలైనప్పటి నుంచీ దేశమంతా నాటు నాటు ఫీవర్​ నడుస్తోంది. ఈ పాట విడుదలైంది మొదలు ఇప్పటివరకు రకరకాల ఫ్లాట్​ఫామ్​ల మీద రికార్డులు సృష్టించింది. తాజాగా ఆస్కార్​తో ప్రపంచమంతా నాటు నాటుకి జై కొట్టిన సంగతి తెలిసిందే. అయితే నాటు నాటు పాట సాధించిన ఘనతని మరోసారి గుర్తు చేశారు ప్రముఖ కన్నడ స్టార్​ హీరో ఉపేంద్ర. ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ చేస్తే ఈ దేశమే ఆడిందని.. ఇప్పుడు యావత్తు ప్రపంచమే డాన్స్ చేస్తోందని అన్నారు. ఇటీవల హైదరాబాద్​లో జరిగిన ‘కబ్జ’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ఉపేంద్ర ఆస్కార్ అందుకున్న RRR చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఉపేంద్ర తెలుగులోనూ పలు సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఆయన నటించిన సినిమా కబ్జ. ఈ సినిమా ప్రెస్​ మీట్​లో ఉపేంద్ర మాట్లాడుతూ..‘ఈరోజు చాలా చాలా స్పెష‌ల్ డే. మొత్తం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీకి ఇదెంతో స్పెష‌ల్. ఎందుకో మీ అందరికీ తెలుసు. గ్రేటెస్ట్ డైరెక్టర్ రాజ‌మౌళి, గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీర‌వాణి.. ఇండియన్ సెన్సేషన్ అయిపోయింది నాటు నాటు సాంగ్. తార‌క్, రామ్ చ‌ర‌ణ్‌ డాన్స్ చేస్తుంటే మొత్తం ఇండియా డాన్స్ చేసింది. ఇప్పుడు వరల్డే డాన్స్ చేస్తోంది. ఆస్కార్ దొరికింది.. ఒక హిస్టరీ క్రియేట్ అయ్యింది. RRR చిత్ర బృందానికి నా అభినంద‌న‌లు’ అన్నారు.

ఇక, తను నటించిన కబ్జ సినిమా గురించి చెబుతూ ‘మీరు ఇప్పటికే సాంగ్, టీజర్, ట్రైలర్ చూశారు. ఇలాగే మొత్తం ఫిలిం ఉంటుంది. విజువ‌ల్ గ్రాండియ‌ర్ మూవీ ఇది. రెండు, మూడేళ్లుగా ఈ సినిమా చేస్తున్నాం. దీని క్రెడిట్ అంతా ఆర్‌.చంద్రు (డైరెక్టర్)కి ద‌క్కుతుంది. ఆయ‌న క‌ల ఈ సినిమా. రెండు, మూడు సార్లు క‌రోనా వేవ్స్ వ‌చ్చాయి. చాలా స‌మ‌స్యలు ఏర్పడిన‌ప్పటికీ ఇలాగే నేను సినిమా చేయాల‌ని చంద్రు డిసైడ్ అయ్యి ‘క‌బ్జ’ సినిమా చేశారు. ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా కెమెరామెన్ ఎ.జె, ఆర్ట్ డైరెక్టర్ శివ‌కుమార్‌, మ్యూజిక్ డైరెక్టర్ ర‌వి బస్రూర్, అంద‌రూ కలిసి ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌ర్క్ చేయ‌టంతో ‘క‌బ్జ’ మూవీ అద్భుతంగా వ‌చ్చింది. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. ల‌క్ష్మీకాంత్ రెడ్డి, సుధాక‌ర్ రెడ్డి ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు’ అని వివరించారు. త్వరలోనే యూఐ అనే సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఆ సినిమాను కూడా తప్పకుండా తెలుగులో విడుదల చేస్తానని మాటిచ్చారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17న తెలుగు, క‌న్నడ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ‘కబ్జ’ సినిమా రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై విడుదల చేస్తున్నారు.