పొన్నియన్​ సెల్వన్​‌‌ 2 కోసం లోకనాయకుడు!

భారత సినీ పరిశ్రమలో గొప్ప దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ప్రముఖ నటీనటులతోపాటు దర్శకులు కూడా అభిమానించే దర్శకుడు ఆయన. మణిరత్నం తాజాగా రూపొందించిన చిత్రం పొన్నియన్​ సెల్వన్​ 1. దక్షిణ భారతదేశాన్ని ఏలిన చోళుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఘన విజయం సాధించింది. అయితే తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ మొదటి భాగం తమిళ భాషలో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించినా మిగతా భాషలో మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కాగా, ఈ సినిమా రెండవ భాగాలుగా తెరకెక్కనుందని ముందే ప్రకటించింది చిత్రబృందం. ప్రస్తుతం రెండో భాగం షూటింగ్​ పూర్తవగా పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమా మొదటి భాగం తమిళ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచినా మిగతా చోట్ల పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన రెండవ భాగం షూటింగ్ విడుదల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెండవ భాగాన్ని ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాటను కూడా విడుదల చేశారు.

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్​, ఆడియో మార్చి 29 వ తేదీ అంటే ఈ రోజే విడుదల చేయనున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్‌, ఆడియో లాంచ్‌ ను చెన్నై లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌ కి ముఖ్య అతిథిగా లోకనాయకుడు కమల్ హాసన్‌ రాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు మేకర్స్​. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ ఈ సినిమాను నిర్మిస్తోంది. పొన్నియన్​ సెల్వన్​ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ , కార్తీ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ , జయం రవి , త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈతరం ప్రేక్షకులనూ బాగా ఆకట్టుకుంది. ఇక, రెండవ భాగం ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందే!