Kalvakuntla Kavitha: బిగ్ బ్రేకింగ్… కవితకు బెయిల్
Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరయ్యింది. నాలుగు నెలల క్రితం ఈడీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించింది. అప్పటి నుంచి కవిత బెయిల్ కోసం పలు కోర్టులను ఆశ్రయించారు. అన్ని కోర్టుల్లోనూ ఆమెకు నిరాశే ఎదురైంది. చివరికి సుప్రీంకోర్టు ఆశ్రయించగా ఇప్పటికే దాదాపు నాలుగు సార్లు వాయిదా వేసి ఈరోజు తుది విచారణ చేపట్టింది. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు.
కవితపై అనవసర ఆరోపణలు చేసిన ఈడీ ఇప్పటివరకు లిక్కర్ కేసులో కవిత రూపాయి తీసుకున్నట్లు కూడా నిరూపించలేకపోయారని.. విచారణలో కవిత సహకరించిందని అన్నారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోదియాకు బెయిల్ వచ్చిందని.. ఆ రకంగా చూసుకుంటే ఇప్పటికే నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించిన కవితకు కూడా బెయిల్ వచ్చి తీరాలని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై కౌంటర్‌గా ఈడీ తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ రాజు స్పందిస్తూ.. కవిత సాక్ష్యులను ప్రభావితం చేయగలరని లిక్కర్ కేసులో ఈడీ నోటీస్ రాగానే తన ఫోన్లన్నీ ఫార్మాట్ చేసి పని వాళ్లకు ఇచ్చేసారని అన్నారు. అలా ఎందుకు చేసారని విచారణలో అడిగితే.. ఫోన్లో స్టోరేజ్ ఎక్కువగా ఉందని ఫార్మాట్ చేసినట్లు చెప్పారని అన్నారు. స్టోరేజ్ ఎక్కువైతే ఎవరైనా ఫైల్స్ డిలీట్ చేస్తారు కానీ ఫార్మాట్ ఎందుకు చేస్తారని అన్నారు. అలా దాదాపు గంటన్నర పాటు ఇరు వైపుల వాదోపవాదాలు విన్న న్యాయమూర్తులు కవితకు బెయిల్ మంజూరు చేసారు. కవితకు బెయల్ వచ్చే అవకాశం ఉందని తెలిసి కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ చేరుకున్నారు. కవితను దగ్గరుండి హైదరాబాద్ తీసుకురానున్నారు.