కట్టుకథ అడ్డంపెట్టుకుని విచారిస్తున్నారు – ఎంపీ అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ మూడోసారి విచారణ ఇవాళ ముగిసింది. దాదాపు 4 గంటలకు పైగా ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం అవినాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక రాజకీయ కుట్రలున్నాయని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. వైసీపీ కార్యకర్తలకు ఈ సందర్బంగా భరోసా ఇస్తున్నానని అవినాష్‌ తెలిపారు. సీబీఐ అధికారుల వద్ద ఉన్నందున ఇవాళ కోర్టులో ఏం జరిగిందో తనకు తనకు తెలియదని.. తప్పుడు ఆధారాలు సృష్టించి విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని గతంలోనే తాను చెప్పానన్నారు. కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్లు సీబీఐ తీసుకుంటోందని.. ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలను పక్కన పెట్టి చిన్నచిన్న విషయాలను ప్రస్తావిస్తూ పెద్దవి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కట్టుకథ అడ్డం పెట్టుకుని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారని ఎంపీ తెలిపారు. సీబీఐ విచారణ కంచే చేను మేసిన చందంగా ఉందని దుయ్యబట్టారు. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని అడిగామని.. రెండు, మూడుసార్లు అడిగినా సీబీఐ స్పందించకపోవడంతో హైకోర్టుకు వెళ్లినట్లు ఆయన వివరించారు.

ఎంపీ టికెట్‌ ఆరోపణలు వింటే నవ్వొస్తోంది..
‘ఎంపీ టికెట్‌’ కోసమే వివేకా హత్య జరిగిందని చేస్తున్న ఆరోపణలు వింటే నవ్వొస్తోందని అవినాష్‌ రెడ్డి తెలిపారు. వివేకా చనిపోయే ముందు రోజు కూడా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారని.. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురాంరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్‌కు ఓటు వేయాలని వివేకా ప్రజల్ని అడిగారని తెలిపారు. కావాలంటే అక్కడి ప్రజల్ని పిలిచి విచారణ చేయవచ్చని ఎంపీ చెప్పారు. కానీ అలా సీబీజీ చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురాం రెడ్డిని పిలిచి విచారణ చేయొచ్చు. అదీ చేయలేదు. ఎవరిదగ్గర ఎలాంటి స్టేట్‌మెంట్‌ తీసుకోలేదు. కేవలం వీళ్ల కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్స్‌ మాత్రమే తీసుకున్నారు. హత్యకు సంబంధంచిన నిజాలను వెలికితీయాలనే ఆలోచనే లేదు. కట్టుకథను అడ్డంపెట్టుకొని.. ఒక వ్యక్తిని టార్గెట్‌ చేసుకొని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని అవినాష్‌ రెడ్డి అన్నారు.

గుండెపోటు అని నేను చెప్పలేదు..

వివేకాది హత్య కాదు గుండె పోటు అని తాను చెప్పలేదని ఎంపీ అవినాష్‌ రెడ్డి తెలిపారు. అసలు హత్య జరిగిన విషయం వివేకా కుటుంబ సభ్యులు చెబితేనే సంఘటనా స్థలానికి తాను వెళ్లినట్లు ఎంపీ పేర్కొన్నారు. ఆ తర్వాత వివేకా మృతి విషయాన్ని అందరి సమక్షంలోనే ఫోన్లో పలువురికి తెలియజేశానని అన్నారు. ఒక వేళ తనవైపు తప్పు ఉంటే.. అసలు ఎవరికీ ముందస్తు సమాచారం ఇచ్చేవాడిని కాదని అవినాష్‌ తెలిపారు. కానీ తాను అలా చేయలేదని అన్నారు.

సునీత నాపై ఎన్ని విమర్శలు చేసినా…
నా సోదరి సునీత ఎన్ని ఆరోపణలు చేసినా తాను మౌనంగానే ఉన్నానని ఎంపీ అవినాష్‌ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో వైకాపా కార్యకర్తలు అయోమయంలో ఉన్నారని.. మేం ఎలాంటి తప్పు చేయలేదని కార్యకర్తలకు ఇవాళ నేను భరోసా ఇస్తున్నానన్నారు. వివేకా కుటుంబంలోనే అంతర్గతంగా విభేదాలు ఉన్నాయని అందువల్లే హత్య జరిగి ఉంటుందని చెప్పారు.

ఆస్తుల పంపాల్లో వివేకా కుటుంబంలో గొడవలు..
వివేకానందరెడ్డికి 2006 నుంచి ఒకరితో సంబంధం ఉంది. 2011లో బహుశా ఆయన రెండో పెళ్లి కూడా చేసుకుని ఉండొచ్చు. ఆ వివాహం చేసుకోవడానికి ఇస్లాం లా ప్రకారం తన పేరును షేక్‌ మహమ్మద్‌ అక్బర్‌గా మార్చుకున్నారు. వారికి షేక్ షెహన్‌షా అనే కుమారుడు కూడా ఉన్నాడు. భవిష్యత్తులో తన రాజకీయ వారసుడిగా షేక్ షెహన్‌షాను ప్రకటించాలని వివేకానందరెడ్డి గట్టిగా భావించారు. ఇదే క్రమంలో అతనికి రెండు కోట్లు మేర ఆస్తులు ఇవ్వాలని వివేకా భావించారు. ఆ విషయమై ఆయన కుటుంబంలో గొడవల జరిగి ఉండవచ్చు. అయితే.. వివేకా అల్లుడే హత్యకు సూత్రధారి అంటూ.. అవినాష్‌ రెడ్డి తరపు లాయర్‌ ఇవాళ తెలంగాణ హైకోర్టులో వాదించడం విశేషం. మరోవైపు సునీత భర్త రాజశేఖర్‌ పేరును అవినాష్‌ ప్రస్తావిస్తూ.. వివేక హత్య జరిగిన రోజు ఆయన రాసిన లేఖను రాజశేఖర్‌ తన వద్దే ఉంచుకున్నాడని.. అలా చేయడం తప్పే కదా అని తెలిపారు. ఈ కేసులో ఆయన పాత్రకూడా ఉండవచ్చని పేర్కొన్నారు. వివేకా చివరిసారిగా రాసిన లేఖలో ఎవరి పేర్లు ప్రస్తావించారు.. అన్న విషయాలు తెలియజేయాలని అన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన ప్రతి విషయాన్ని కోర్టు, మీడియా ముందుకు తీసుకొస్తూనే ఉంటానని.. ఇంతకాలం మాట్లాడకపోవడానికి ఇవే కారణాలని అవినాష్ తెలిపారు. దీని వెనుక ఉన్న రాజకీయ కుట్రలను ఛేదిస్తామన్నారు. ఎంత దూరమైనా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అవినాష్‌ రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ మరోసారి విచారణకు రమ్మందని ఎప్పుడైనా తాను వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు.