NTR ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ‘దేవర’ పోస్టర్‌కి రక్తాభిషేకం!
Machilipatnam: సినీ తారలకు అభిమానులు ఉండటం మామూలే. వాళ్ల అభిమాన హీరో హీరోయిన్ల సినిమా విడుదలకి, పుట్టినరోజుకీ పాలాభిషేకాలు, పూలాభిషేకాలు అంటూ నానా హంగామా చేయడం కూడా మామూలే. కానీ కొందరు మాత్రం ‘ఇదేం అభిమానం..’, ‘అభిమానం కాదు.. పైత్యం’ అనే రేంజ్లో ప్రవర్తించి వాళ్లు చిక్కుల్లో పడటమే కాకుండా తమ హీరోనూ వివాదాల్లోకి లాగుతారు. ప్రస్తుతం ఎన్టీఆర్(Jr NTR) అభిమానులు కూడా అలాగే ప్రవర్తించి వార్తల్లో నిలిచారు.
అసలేం జరిగిందంటే.. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. అభిమానులు తారక్ పుట్టినరోజును ఘనంగానే సెలబ్రేట్ చేసుకున్నారు. బర్త్‌డే ట్రీట్‌గా ఎన్టీఆర్ 30 సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva). ఈ చిత్రానికి ‘దేవర’(Devara) అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫస్ట్ లుక్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలోని కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఓ గొర్రె పోతుని బలి ఇచ్చి రక్తంతో ఎన్టీఆర్ ఫొటోకి అభిషేకం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మూగ జీవాలను అభిమానం పేరుతో ఇలా హింసించటం ఎందుకు? అంటూ సదరు వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ రూపంలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ పని కరెక్ట్ కాదని, ఇలాంటి పనులు చేయకండని ఎన్టీఆర్ తన అభిమానులకు చెప్పాలని అంటున్నారు నెటిజన్లు. మరి దీనిపై తారక్ ఎలా స్పందిస్తారో చూడాలి.