Jogulamba Gadwal: డాక్టర్ నిర్వాకం.. చిన్నారికి కుట్లకు బదులు ఫెవిక్విక్!
Jogulamba Gadwal: ఏ ప్రమాదం జరిగినా మొదటగా గుర్తొచ్చేది వైద్యులే. కొన ఊపిరితో ఉన్న వారిని సైతం బ్రతికించిన ఎన్నో ఘటనలు డాక్టర్లను నడిచే దేవుళ్లుగా నిరూపించాయి. అలాంటి గౌరవమైన వృత్తికి మచ్చ తెచ్చేలా కొందరు డాక్టర్ల ప్రవర్తన ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా అలాంటి సంఘటన జోగులాంబ గద్వాల్(Jogulamba Gadwal) జిల్లాలో చోటు చేసుకుంది. దెబ్బ తగిలిందని ఆసుపత్రికి వచ్చిన ఓ చిన్నారికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో (Fevikwik Treatment) అతికించారు సదరు డాక్టర్లు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
కర్ణాటక(Karnataka) రాష్ట్రం రాయచూరు(Raichur) జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు తమ బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో రెండ్రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లా అయిజకు వెళ్లారు. వీరి ఏడేళ్ల కుమారుడు ప్రవీణ్ చౌదరి గురువారం రాత్రి వెళ్లిలో ఆడుకుంటూ కిందపడ్డాడు. దీంతో ఎడమ కంటికి పైన తీవ్ర గాయమైంది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
గాయం లోతుగా కావటంతో అక్కడ కుట్లు పడాల్సి ఉంది. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం కుట్లకు బదులు.. ఫెవిక్విక్ అంటించి వైద్యం చేశారు. అది గుర్తించిన బాలుడి తండ్రి కృష్ణవంశీ ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. ఫెవిక్విక్‌తో అంటించి వైద్యం చేయటమేంటని మండిపడ్డారు. ఇన్‌ఫెక్షన్ అయితే ఎవరిది బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది పొరపాటు చేసి ఉండొచ్చని, బాలుడికి ఏమీ కాదని ఆసుపత్రిలోని డాక్టర్ కృష్ణ వంశీకి నచ్చజెప్పాడు. ఏమైనా జరిగితే తాను బాధ్యతవహిస్తానని తండ్రికి హామీ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.