YCP లేని AP కోసం BJP పెద్దలను కలిశా – పవన్‌ కల్యాణ్‌

ఢిల్లీలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ బీజేపీ పెద్దలను కలిశారు. పవన్‌తోపాటు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్బంగా మంగళవారం సాయంత్రం సుమారు 45 నిమిషాల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్‌ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. వైసీపీ పార్టీ చేస్తున్న అరాచకాలను బీజేపీ పెద్దలకు వివరించడం జరిగిందని వారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం బీజేపీతో గత రెండ్రోజులుగా కీలక చర్చలు జరిపినట్లు పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడంపై చర్చించామని.. ఇది జనసేన ఎజెండా మాత్రమే కాదు.. బీజేపీ ఎజెండా కూడా అని చెప్పారు. జగన్‌ పాలనలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యం మొదలైన అనేక విషయాలపై చర్చలు జరిపామన్నారు. అన్నిటిపైనా.. అన్ని కోణాల్లో చర్చించామని.. ఇవి సత్ఫలితాలిచ్చాయని.. అవి ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో తెలుస్తుందని తెలిపారు.

పొత్తులపై చర్చించలేదు…
రానున్న ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో జనసేన, బీజేపీ పార్టీలు బలంగా వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తామని పవన్‌ పేర్కొన్నారు. అయితే.. బీజేపీ నాయకులతో జరిగిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తులు ఉంటాయి అన్న అంశంపై చర్చ జరగలేదని అన్నారు. రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో ఏవిధంగా బలోపేతం అవ్వాలి, అధికారం ఎలా సాధించాలి అనే అంశాలపై మాత్రమే చర్చించాం అని పవన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం సాధించడానికి అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ తనను తాను సంస్థాగతంగా బలోపేతం చేసుకునే చర్యలు త్వరలో చేపడుతుందన్నారు. ఏపీలో సుస్థిర పాలన ఏర్పాటే తమ లక్ష్యమని తెలిపారు. ఏపీ రాజకీయాలపై బీజేపీ పెద్దలతో చర్చించాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే.. అది ఇప్పటికి సాధ్యపడిందని పవన్‌ తెలిపారు. మరోవైపు రాష్ట్ర భవిష్యత్‌ కు సంబంధించిన రాజకీయ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించామని నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. రాజకీయ కోణం నుంచే కాక అభివృద్ధి కోణంలోనూ మాట్లాడామన్నారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ముందడుగు వేయాలని బీజేపీ కూడా భావిస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన అనేక మంది పెద్దలను కలిసినప్పుడు స్పష్టమైందని అన్నారు. ఇక పవన్‌ పర్యటనలో భాగంగా సోమవారం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌తో కీలక మంతనాలు జరిపారు. మంగళవారం ఉదయం వారు మురళీధరన్‌తో పాటు బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌తో సుదీర్ఘంగా చర్చించారు. మంగళవారం రాత్రి నడ్డాతోనూ గంటకు పైగా భేటీ అయ్యారు.