ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోన్న జనసేన ఆవిర్భావ సభ!
జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను ఈ నెల 14న మచిలీపట్నంలో జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సభకు పవన్ తన వారాహి వాహనంలో భారీ ర్యాలీ నడుమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళగిరి నుంచి మచిలీపట్నంకు వెళ్లనున్నారు. ఇక సభ నిర్వహణకు సుమారు 34 ఎకరాలను పార్టీ నాయకులు సిద్దం చేస్తున్నారు. సుమారు 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆవిర్భావ వేదికకు పొట్టి శ్రీరాములు పేరును పెడుతున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పటకే ప్రకటించారు.
పార్టీ స్థాపించి పదేళ్లు అవుతున్నా… ప్రభావం అంతేనా?
జనసేన పార్టీని పవన్ కల్యాణ్ 2014లో స్థాపించారు. ఆ వెంటనే సాధారణ ఎన్నికలు రావడంతో టీడీపీ-బీజేపీ కూటమికి ఆయన మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. చివరికి పవన్ కూడా రెండు చోట్లా ఓడిపోయారు. ఇక క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ కార్యకర్తలు లేరు. అటు పార్టీలోనూ పేరున్న నాయకులు లేరు. ఇవన్నీ పార్టీకి లోటుగా కనిపిస్తున్నాయి. అయితే పవన్‌కు ఉన్న చరీష్మా ఎంతోకొంత ఓట్లు ఈసారి తెచ్చిపెడతాయని అందరూ భావిస్తున్నారు. కౌలు రైతులను ఆదుకోవడం,, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు పవన్‌కు కొంత కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు. జనసేన ఒంటరిగా ప్రభావం చూపలేకపోయినా.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం లేకపోలేదు. ఇది 2014 ఫలితాలతో కూడా అందరికీ స్పష్టమైన విషయమే.. అందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ మంత్రులు, నాయకులు టీడీపీ – జనసేన వేర్వేరుగా పోటీ చేయాలని రెండు పార్టీలకు సవాలు విసురుతున్నారు.
ఆవిర్భావ సభ కీలకం..
మరో ఏడాది కాలంలో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ, టీడీపీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్న తరుణంలో.. అసలు జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్తుంది.. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. టీడీపీతో ఆ పార్టీ పొత్తు ఉంటుందా లేదా.. అసలు ఆ పార్టీ వ్యూహం ఏంటి అన్నదానిపై ప్రజలతోపాటు ఆ పార్టీ కార్యకర్తలకు ఓ క్లారిటీ లేదు. ఈనేపథ్యంలో మరికొన్ని రోజుల్లో నిర్వహించనున్న ఆవిర్భావ సభ వేదికపై నుంచి పొత్తుల అంశం, వారాహి పర్యటన తేదీ, జనసేన మ్యానిఫెస్టో, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న అంశాలపై జనసేనాని స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో జనసేనపై ఉన్న నెగిటివిటీ కొంత తగ్గించుకోవచ్చని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు ఆవిర్భావ సభకంటే ముందే.. పవన్ మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు రానున్నారు. అక్కడ రెండు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ముందుగా కాపు సంక్షేమ సంఘాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో కాపు రిజర్వేషన్ పై వారి సలహాలు సూచనలు తీసుకుని.. ఆవిర్భావ సభలో పలు అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇక రెండోది పార్టీ కీలక నేతలతో ఆయన సమావేశం అవుతారు. ఆ సమావేశంలోనే పార్టీ భవిష్యత్తు.. ఎన్నికల వ్యూహాలపై క్లారిటీ ఇస్తారని సమాచారం.