జనసేన ఆవిర్భావ సభ…పొత్తుల‌పై క్లారిటీ ఇస్తారా?

జనసేన పార్టీ స్థాపించి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఈక్రమంలో మార్చి 14న పదవ ఆవిర్భావ సభను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. దాదాపు 34 ఎకరాల స్థలంలో అన్ని భద్రతా ఏర్పాట్ల నడుమ భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు జనసేన కార్యకర్తలకు ఈ వేదికపై నుంచి రానున్న ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

వారాహి వాహనంలో పవన్‌ ఎంట్రీ..
మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ సభకు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వారాహి వాహనంలో‌ పవన్‌కల్యాణ్‌ వస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సభా వేదికకు శ్రీ పొట్టి శ్రీరాములు పేరు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. పవన్‌ ప్రసంగం ఆధ్యంతం ఉత్సాహభరితంగా సాగుతుందని మనోహర్‌ తెలిపారు. జనసేనానిని ప్రతిపక్షాలు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎంతగా అవమానించినా అవమానించినా ప్రజల కోసం పవన్‌ నిలబడ్డారని అన్నారు.

పొత్తులపై క్లారిటీ వస్తుందా?
గత కొంత కాలంగా టీడీపీ జనసేన పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే.. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది.. ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలి అన్న అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఇక ఆవిర్భాభ సభా వేదికపై నుంచి పొత్తులపై పవన్‌ స్పష్టత ఇస్తారో లేదో చూడాలి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఏర్పాటు చేసిన సభలో పొత్తులు పెట్టుకునే ఆలోచన ఉన్నట్లు పరోక్షంగా పవన్‌ స్పష్టం చేశారు. మరి ఈ సారి జరగబోయే ఆవిర్భావ సభలో ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు అన్నదానిపై జనసేన శ్రేణుల్లో ఉత్కంట నెలకొంది.

మచిలీపట్నంలోనే ఎందుకంటే..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను నిత్యం విమర్శించే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని ఇలాకాలోనే జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. దీంతో ఈ సభపై మరింత ఆసక్తి నెలకొంది. వైసీపీ పార్టీతోపాటు పేర్నినానిపై వేసే పవన్‌ పంచుల కోసం ఆ పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా మచిలీపట్నం నుంచే రానున్న ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేస్తామని పవన్‌ ఇదివరకే ఓ కార్యక్రమంలో చెప్పారు. ఇక ప్రధానంగా మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. దీంతో సభ ఏర్పాటుకు స్థలాలు ఇచ్చేవారు ఉండటం వల్ల మచిలీపట్నంలో కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం మాత్రమే ఉండటంతో సభలో పవన్‌… జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇస్తారా లేదా.. మరేదైనా కార్యాచరణ ప్రకటిస్తారా.. అన్న విషయాలు స్పష్టం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.