నాకు జైలు శిక్షా? ఐ డోన్ట్ కేర్ – రాహుల్ గాంధీ
దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాలో మాట్లాడారు. ‘నేను ఒకటే ప్రశ్న అడిగాను.. అదాని షెల్ కంపెనీలలో రూ.20వేల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారు.. అదాని, మోడీ స్నేహం గురించి పార్లమెంట్‌లో మాట్లాడాను.. వీరిద్దరి బంధం ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో ఉంది’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
‘నిబంధనలు మార్చి ఎయిర్‌పోర్టులు అదానికి ఇచ్చారు.. నేను విదేశీ శక్తుల నుంచి సహకారం కోరానని కేంద్ర మంత్రులు పార్లమెంట్‌లో అబద్ధం చెప్పారు.. నేను రెండు లేఖలు రాస్తే వాటికి జవాబు లేదు.. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారు’ అని రాహుల్ అన్నారు. ‘నేను దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను, పోరాడుతాను.. నేను ఎవరికి భయపడను.. నాపై అనర్హత వేటు వేసినా, జైలుకు పంపినా తగ్గేది లేదు.. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా జరుగుతోంది.. నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్’ అంటూ ఆయన బదులిచ్చారు.
‘ప్రజల్లోకి వెళ్లడం ఒక్కటే ఇప్పుడు విపక్షాలకు ఉన్న అవకాశం.. ప్రజల్లోనే ఉంటాను, ఇప్పటికే భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్లాను.. ఈ దేశం నాకు ప్రేమ, మర్యాద, ఇంకెంతో ఇచ్చింది.. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే, న్యాయవ్యవస్థను గౌరవిస్తా, జైలు శిక్షపై ఏం మాట్లాడను.. నా తరువాతి ప్రసంగానికి భయపడే ప్రధాని నాపై అనర్హత వేటు వేశారు.. బీజేపీ నేతలంతా మోడీ అంటే భయపడతారు.. నా ప్రశ్నంతా రూ.20వేల కోట్లు ఎక్కడివి అని మాత్రమే.. నాకు మద్దతుగా మాట్లాడిన విపక్షాలకు ధన్యవాదాలు’ అని రాహుల్ తెలిపారు. అయితే తాను జైలుకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడాన్ని బట్టి.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఆదర్శంగా రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 1977లో అనర్హత వేటు పడినప్పుడు కొద్ది రోజులు ఇందిరాగాంధీ జైల్లో ఉన్నారు. ఇప్పటికే రాహుల్ కు మద్దతుగా మూకుమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఎంపీలు మూకుమ్మడి రాజీనామా చేసే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్
తీవ్రంగా పరిశీలిస్తోంది. త్వరలో సూరత్ లేదా ఢిల్లీలో భారీ బహిరంగ సభకు కూడా ఆ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.